Budget 2023 Live Updates: రూ. 7లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
01 February 2023, 13:31 IST
- Budget 2023 Live Updates: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ పార్లమెంటు ముందుకు వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ (Union Budget 2023-24)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేడు (ఫిబ్రవరి 1, బుధవారం) పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 2024 లోక్‍సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం తీసుకువస్తున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. దీంతో ఈసారి ఆర్థిక పద్దుపై మరింత ఆసక్తి, ఆకాంక్షలు నెలకొన్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో (Budget Sessions) నిర్మలమ్మ బడ్జెట్‍పై మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పరిశ్రమలు, కార్పొరేట్ల వరకు అనేక రంగాలు, వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను మినహాయింపు పెంపు కోసం వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులు వేచిచూస్తున్నారు. ఇలా ఎంతో కీలకమైన, ఎన్నో అంచనాలు ఉన్న 2023 కేంద్ర బడ్జెట్‍పై ఎప్పటికప్పుడు తాజా అప్‍డేట్‍ల కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవుతూనే ఉండండి.
ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన బడ్జెట్ ఎంత?
తాజా బడ్జెట్ 2023-24లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్‌కు మొండి చేయే చూపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలకు కూడా మోక్షం లభించలేదు. ఆ చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ఓడరేవు, కాకినాడ పెట్రోకాంప్లెక్స్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ మోక్షం లేకుండా పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బడ్జెట్ లెక్కలు ఇలా..
2023-24కు కేంద్ర బడ్జెట్ సైజు- రూ. 45లక్షల కోట్లు
ప్రభుత్వ అప్పులు- రూ. 11.8లక్షల కోట్లు (గ్రాస్ రూ. 15.3లక్షల కోట్లు)
ట్యాక్స్ రిసిప్ట్స్- రూ. 27.2లక్షల కోట్లు
ద్రవ్య లోటు- 5.9శాతం
సిగరెట్లపై కస్టం సుంకం పెంపు
సిగరెట్లపై కస్టం డ్యూటీని 16శాతం పెంచుతున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఫలితంగా సిగరెట్ ధరలు 1.5-2శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే.. మార్కెట్లో అంచనాల కన్నా ఇది తక్కువగా ఉంది. ఫలితంగా ఐటీసీ షేరు ధర 1శాతం కన్నా ఎక్కువ లాభంలో ట్రేడ్ అవుతోంది.
క్యాపిటల్ గెయిన్స్‌పై..
క్యాపిటల్ గెయిన్స్‌పై నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. క్యాపిటల్ గెయిన్స్‌ను పెంచుతారని స్టాక్ మార్కెట్ వర్గాలు భావించాయి. అలాంటి ప్రకటన ఏమీ లేకపోవడంతో.. దేశీయ సూచీలు లాభాల్లో పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ 900కుపైగా పాయింట్ల లాభంతో దూసుకెళుతోంది. నిఫ్టీ 260 పాయింట్లు వృద్ధిచెందింది.
ముగిసిన బడ్జెట్ ప్రసంగం
లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ముంగించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వేతన జీవులకు ఊరటనిస్తూ.. పన్ను విధానాల్లో మార్పులను ప్రకటిస్తూ.. తన ప్రసంగాన్ని ముగించారు.
కొత్త పన్ను విధానం
0-3లక్షలు- ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
3-6 లక్షలు- 5శాతం పన్ను చెల్లించాలి
6-9 లక్షలు- 10శాతం పన్ను చెల్లించాలి
9-12 లక్షలు- 15శాతం పన్ను చెల్లించాలి
12-15శాతం- 20శాతం పన్ను చెల్లించాలి
15లక్షలు పైబడి- 30శాతం పన్ను చెల్లించాలి.
మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్
“గతంలో 5లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కొత్త పన్ను విధానంలో రీబేట్ లిమిట్‌ను రూ. 7లక్షలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నాము. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు” అని నిర్మల అన్నారు.
ద్రవ్య లోటు
"2025-26 నాటికి ద్రవ్య లోటు 4.5శాతం కన్నా తక్కువ ఉంటాలని మేము భావిస్తున్నాము. గతంలో ఇదే చెప్పాము. ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నాము. ఇక ఎఫ్వై2024లో ద్రవ్యలోటు 5.9శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాము," అని నిర్మలా సీతారామన్ అన్నారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
“మహిళల కోసం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ను ప్రవేశపెడుతున్నాము. రెండేళ్ల పాటు డిపాజిట్లు చేసుకోవచ్చు. 7.5శాతం వడ్డీ రేటు ఇస్తామను” అని నిర్మలా సీతారామన్ అన్నారు.
యువశక్తికి ప్రోత్సాహం..
యువశక్తిని ప్రోత్సహించడం కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యతగా తీసుకున్నాము. నైపుణ్య అభివృద్ధి ప్రోగ్రామ్‌ల తదుపరి దశను ప్రారంభిసతాము. సరికొత్త స్కిల్ ఇండియా డిజిటల్ వేదికను తీసుకొస్తాము. ఫలితంగా విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త అప్రెన్టిసైషిప్ స్కీమ్‍ను తీసుకొస్తున్నాము.
మౌలికవసతులు.. పెట్టుబడులు..
మౌలికవసతులు, పెట్టుడులకు పెద్దపీట వేస్తున్నాము. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఔట్లేని 33శాతం పెంచి రూ. 10లక్షల కోట్లకు చేర్చుతున్నాము. ఇది దేశ జీడీపీలో 3.3శాతం.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ వరుసగా 540, 120 పాయింట్ల లాభంలో ఉన్నాయి.
పాత వాహనాలకు చెల్లు..
“కాలం చెల్లిన వాహనాల తొలగింపు మా తక్షణ ప్రధాన్యం. కాలం చెల్లిన ప్రభుత్వ వాహనాలను తప్పిస్తాము. కొత్త వాహనాల కనుగోలుకు రాష్ట్రాలకు సాయం అందిస్తాము." అని నిర్మల తెలిపారు.
వ్యవసాయ రంగంపై నిర్మల వ్యాఖ్యలు
"దేశంలోని 63వేల వ్యవసాయ పరపతి సంఘాలను డిజిటలైజేషన్ చేస్తున్నాము. పరపతి సంఘాల డిజిటలైజేషన్‌కు రూ. 2వేల కోట్ల నిధులు ఇస్తున్నాము. ప్రభుత్వ- ప్రైవేటు భాగాస్వామ్యానికి మరింత ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉంది. పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ. 6వేల కోట్లతో ప్రత్యేక పథకం తీసుకొస్తున్నాము. తృణధాన్యాలకు భారత్‌ను కేంద్రంగా చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు ఇస్తాము," అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
9రెట్లు పెరిగిన రైల్వే బడ్జెట్..
2023-24లో రైల్వేకు రూ. 2.40లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. 2013-14తో పోల్చితే.. ఇది 9రెట్లు పెరిగినట్టు వివరించారు.
రైల్వే బడ్జెట్..
2023-24 ఆర్థిక ఏడాదిలో రైల్వే బడ్జెట్‍కు రూ. 2.40లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం కేటాయింపులను 66శాతం పెంచుతున్నాము. ఫలితంగా కేటాయంపులు రూ. 79వేల కోట్లకు చేరాయి.
ఫార్మా రంగంపై..
“ఫార్మా రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించందుకు కొత్త ప్రోగ్రామ్ని ప్రవేశపెడతాము. ఆవిష్కరణలవైపు ఎక్కువగా మొగ్గు చూపే విధంగా.. పరిశ్రమను ప్రోత్సహిస్తాము. 157 కొత్త నర్సింగ్ కాలేజీలను ప్రవేశపెడతాము. 157 వైద్య కళాశాలలు ఇప్పటికే వచ్చాయి,” అని తెలిపారు నిర్మలా సీతారామన్
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
“వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాము. వ్యవసాయ రంగంలో స్టార్టప్స్‌ను పెంపొందించేందుకు ఓ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాము. అదే.. అగ్రికల్చర్ యాక్సలేటర్ ఫండ్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించాము. 2047 లక్ష్యంగా పథకాలు ప్రవేశపెడుతున్నాము. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ సహాయపడుతుంది. ”
7శాతం వృద్ధి అంచనా..
“భారత దేశ వృద్ధి అత్యంత ఆకర్షణీయంగా ఉందని ప్రపంచం గుర్తించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాము. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మనదే అత్యధికంగా నిలుస్తుంది! అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. మనం వృద్ధిని సాధించడం విశేషం. 2014 నుంచి మా ప్రభుత్వం ప్రజల కోసమే కృషిచేస్తోంది. ప్రజలకు నాణ్యమైన జీవితం, గౌరవం ఇచ్చేందుకు పనిచేస్తోంది. కొవిడ్ సమయంలోనూ ప్రజలకు ఆకలి కలగకుండా చూసుకుంది ఈ ప్రభుత్వం. 9ఏళ్ల కాలంలో.. 10వ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది,” అని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్.
అమృత కాలంలో భారత్ వృద్ధి భేష్..
“అమృత కాలంలో వస్తున్న తొలి బడ్జెట్ ఇది. కొవిడ్, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. భారత్ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. పేదలకు ఈ ప్రభుత్వం అడుఅడుగునా అండగా నిలుస్తోంది,” అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
క్యాబినెట్ మీటింగ్ ప్రారంభం
2023-24 బడ్జెట్‍కు అమోదం తెలిపేందుకు కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. 11 గంటలకు కేంద్ర బడ్జెట్‍ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
రాష్ట్రపతి భవన్‍కు ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‍కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. 10 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. 11 గంటలకు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు నిర్మలా సీతారామన్.
పారిశ్రామిక అంచనాలు
Union Budget 2023: ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ)ను కొనసాగించాలని పారిశ్రామిక రంగం కోరుకుంటోంది. ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాన్ని మరింత పెంచాలని ఆశిస్తోంది. అలాగే మరిన్ని రంగాలకు కూడా పీఎల్ఐ స్కీమ్‍ను విస్తరించాలని అంచనా వేస్తోంది. జీఎస్టీ మినహాయింపుల కోసం వాహన రంగం కూడా ఆశగా ఎదురుచూస్తోంది.
వేతన జీవుల ఆశలు ఇవే
Union Budget 2023: పన్ను శ్లాబుల్లో మార్పులు, కనీస ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపన్ను (IT) మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు. ఈ 2023-24 బడ్జెట్‍లోనైనా ఉపశమనం లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాగే స్డాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు పెంచాలని వేతన జీవులు ఆకాంక్షిస్తున్నారు. హెచ్‍ఆర్ఏతో పాటు మరిన్ని పరిమితుల సడలింపులపై కూడా అంచనాలు ఉన్నాయి.
రైల్వే బడ్జెట్
Railway Budget 2023: కేంద్ర బడ్జెట్‍లోనే రైల్వే బడ్జెట్ కూడా ఉంటుంది. పార్లమెంటు ముందుకు రైల్వే బడ్జెట్ కూడా నేడే రానుంది. టికెట్ ధరల నియంత్రణ, ట్రైన్లలో శుభ్రత, రైళ్ల సంఖ్య పెంపుపై ప్రజలు అంచనాలు పెట్టుకున్నారు. కొత్త రైల్వే లైన్లపై కూడా ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. అలాగే, ముఖ్యమైన పోటీ పరీక్షల సమయాల్లో వివిధ ప్రాంతాల మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరికొన్ని గంట్లలో..
Union Budget 2023: నేటి (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2023 కేంద్ర బడ్జెట్ ప్రసంగం మొదలవుతుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పేపర్‌లెస్ విధానంలో డిజిటల్‍గా ఈ బడ్జెట్ ఉంటుంది.