Scam alert : వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డు పంపించి మొత్తం దోచేస్తున్నారు.. జాగ్రత్త!
19 November 2024, 9:45 IST
WhatsApp wedding scams : వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్! కొత్త వెడ్డింగ్ స్కామ్‌తో మీరు మోసపోవచ్చు. వాట్సాప్‌లో మీకు ఏదైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ వస్తే జాగ్రత్త!
వాట్సాప్ వెడ్డింగ్ స్కామ్‌తో మొత్తం దోచేస్తారు!
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి! సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త ప్లాన్‌తో ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఒక కొత్త రకమైన స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదే ‘వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్’! పెళ్లి ఆహ్వానం వచ్చిందని మీరు డౌన్లోడ్ చేసే ఫైల్, మీ సున్నితమైన సమాచారాన్ని మోసగాళ్ల చేతుల్లో పెడుతుంది. ఆ తర్వాత మీరు దోపిడీకి గురవుతారు. అసలు విషయం ఏంటంటే..
వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్..
స్కామర్లు వాట్సాప్ ద్వారా నకిలీ డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్లను పంపుతున్నారు. ఈ ఆహ్వానాలు తరచుగా ‘ఏపీకే ఫైళ్ల’ రూపంలో, వివాహ ఆహ్వాన పత్రికల రూపంలో వస్తుంటున్నాయి. చూడటానికి ఇవి హానికరంగా కనిపించవు. కానీ యూజర్లు ఈ అనుమానాస్పద ఫైళ్లను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసినప్పుడు డివైజ్‌లలోని సున్నితమైన సమాచారానికి రక్షణ పోతుంది!
ఈ హానికరమైన ఏపీకే ఫైల్స్ మోసగాళ్లకు ఓటీపీలు, సందేశాలు, బ్యాంకింగ్ యాప్స్ సహా మీ ఫోన్లలోని సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది.
ఫేక్ లోన్ ఆఫర్స్, లాటరీ సందేశాలు లేదా మీ దృష్టిని ఆకర్షించడానికి రూపొందించిన ఏదైనా ఇతర పథకాల కోసం స్కామర్లు ఇలాంటి వ్యూహాలను ఉపయోగించవచ్చు.
వీటి లక్ష్యం ఒక్కటే- హానికరమైన ఏపీకే ఫైలును డౌన్లోడ్ చేయించడం, ఇన్స్టాల్ చేయించడం, మిమ్మల్ని మోసం చేయడం.
అధికారుల హెచ్చరిక..
ఈ వాట్సాప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్‌పై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విశ్వసనీయత లేని వారి నుంచి వచ్చిన ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని వారు సూచించారు. ఏపీకే ఫైళ్లతో సంబంధం ఉన్న ప్రమాదాలను నొక్కి చెప్పారు.
మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి: మీ పరికరాన్ని తాజా సాఫ్ట్వేర్, భద్రతాపరమైన అప్డేట్స్తో అప్‌గ్రేడ్ చేసుకోండి. అదనపు భద్రత కోసం టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ని ప్రారంభించడం.
ఈ టిప్స్ పాటించండి..
- ఫైల్ టైప్స్తో జాగ్రత్తగా ఉండండి: నిజమైన వివాహ ఆహ్వాన పత్రికను ఏపీకే ఫైల్‌గా పంపే అవకాశం లేదు. వీడియో లేదా పీడీఎఫ్ ఫైల్ మాత్రే ఉంటుంది. ఫైల్ని తెరవడానికి ముందు ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.
- విశ్వసనీయ సోర్స్‌కి కట్టుబడి ఉండండి: వివాహ ఆహ్వానాలు సాధారణంగా తెలిసిన పరిచయాల ద్వారా వస్తాయి. మీకు తెలియని నంబర్ నుంచి ఆహ్వానం అందితే, జాగ్రత్తగా ముందుకు సాగండి.
- తెలియని వారి నుంచి వచ్చిన అప్లికేషన్ ఇన్స్టలేషన్లను నిలిపివేయండి: మీ ఆండ్రాయిడ్ పరికరంలో ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయండి. ఇది మిమ్మల్ని రక్షించడానికి రూపొందించిన అంతర్నిర్మిత భద్రతా చర్య.
- మీ ఫోన్‌ను అప్డేట్ చేసుకోండి: దోపిడీ ప్రమాదాన్ని తగ్గించడానికి మీ పరికరంలో తాజా భద్రతా ప్యాచ్‌లు ఉన్నాయని నిర్ధారించుకోండి.