Amazon chatbot: చాట్ జీపీటీ తరహాలో ఆమెజాన్ చాట్ బాట్; కానీ వారికి మాత్రమే..
29 November 2023, 14:50 IST
Amazon chatbot ‘Amazon Q’: ప్రత్యేకంగా వ్యాపారాల కోసం ఆమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) రూపొందించిన Amazon Q అనే కొత్త కృత్రిమ మేథ (AI) ఆధారిత చాట్‌బాట్‌ను ఆమెజాన్ ప్రారంభించింది. ఇది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, కంటెంట్‌ను రూపొందించగలదు. కంపెనీ డేటాను ఉపయోగించి అవసరమైన సూచనలు చేయగలదు.
ప్రతీకాత్మక చిత్రం
Amazon chatbot ‘Amazon Q’: చాట్ జీపీటీ (ChatGPT) తరహాలో AI చాట్‌బాట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆమెజాన్ ప్రకటించింది. ఈ చాట్ బాట్ కు Amazon Q అనే పేరు పెట్టింది. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఈ విషయంలో కొంత ఆలస్యంగానే స్పందించింది. ఇప్పటికే దాని పోటీదారులు తమ సొంత చాట్ బాట్ లను తీసుకువచ్చాయి. బార్డ్ (Bard) పేరుతో గూగుల్, ఓపెన్ ఏఐ (Copilot) పేరుతో మైక్రోసాఫ్ట్ తమ చాట్ బాట్ లను తీసుకువచ్చాయి. ఈ రంగంలో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది.
‘Amazon Q’: ఏంటీ ఆమెజాన్ క్యూ?
తమ లేటెస్ట్ చాట్ బాట్ ఆమెజాన్ క్యూ (Amazon Q) ని ‘కొత్త రకం జనరేటివ్ AI పవర్డ్ అసిస్టెంట్’ అని ఆమెజాన్ చెబుతోంది. ఇది ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించిన టూల్. ఇది ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. కంటెంట్‌ను రూపొందించగలదు. డేటాను ఉపయోగించి వివిధ ఆప్షన్స్ ను సూచించగలదు.
ఎలా ఉపయోగపడుతుంది?
ఆమెజాన్ క్యూ (Amazon Q) గురించి తాజా బ్లాగ్ పోస్ట్ లో ఆమెజాన్ వివరించింది. “మీ వ్యాపారానికి అనుగుణంగా ఈ చాట్ బాట్ పని చేస్తుంది. మీ కంపెనీ సమాచార రిపోజిటరీలు, కోడ్, డేటా, ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్‌లకు కనెక్ట్ చేయడం ద్వారా దీని సేవలను పొందవచ్చు. ఇది మీకు అవసరమైన కంటెంట్‌ను రూపొందించడానికి, వివిధ ఇన్ సైట్స్ ను పొందడానికి ఉపయోగపడుతుంది. అలాగే, ఉద్యోగులకు పనులను క్రమబద్ధీకరించడానికి, వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, సమస్యల పరిష్కారానికి, పనిలో సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి అవసరమైన సమాచారం, సలహాలను అందిస్తుంది’’ అని ఆమెజాన్ వివరించింది.