Google Bard: ‘గూగుల్ బార్డ్’ ఏఐ చాట్‍బోట్ ఇండియాకు వచ్చేసింది: చాట్‍జీపీటీకి పోటీగా.. ఉచితంగా ఎలా వాడాలంటే..!
Google Bard: గూగుల్ బార్డ్ ఏఐ చాట్‍బోట్ భారత్‍లోనూ అందుబాటులోకి వచ్చేసింది. వెయిట్ లిస్ట్ అవసరం లేకుండా ఇప్పుడు నేరుగా వాడుకోవచ్చు.
Google Bard AI Chatbot: టెక్ దిగ్గజం గూగుల్(Google)కు చెందిన ఏఐ చాట్‍బోట్ 'గూగుల్ బార్డ్ (Google Bard)' ఇండియా సహా మొత్తంగా 180 దేశాల్లో అందుబాటులోకి వచ్చేసింది. దీంతో వెయిట్ లిస్ట్ లేకుండానే ఇక నేరుగా ఈ ‘గూగుల్ బార్డ్’ను వాడుకోచ్చు. 180 దేశాల్లో బార్డ్ ఏఐ చాట్‍బాట్‍ను అందుబాటులోకి తెచ్చినట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అధికారికంగా వెల్లడించారు. గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్‍లో ఈ ‘బార్డ్’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‍బోట్ (AI Chatbot)ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. కొంతకాలంగా టెస్టర్లకు ఈ బార్డ్ యాక్సెస్ ఉండగా.. ఇప్పుడు భారత్ సహా 180 దేశాల్లోని అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బార్డ్ ఏఐ చాట్‍బోట్‍ను ఉచితంగా వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన చాట్ జీపీటీ(ChatGPT)కి పోటీగా ఈ గూగుల్ బార్డ్ అడుగుపెట్టింది. వివరాలివే..
Google Bard AI Chatbot: దాదాపు చాట్‍జీపీటీలానే గూగుల్ బార్డ్ ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రశ్నను టెక్స్ట్ ద్వారా అడిగితే సమాధానాన్ని వివరంగా ఇస్తోంది. అయితే, ఇతర ఏఐ టూల్స్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ‘బార్డ్’కు కొత్త ఫీచర్లను, అప్‍డేట్లను తీసుకొచ్చింది గూగుల్. రానున్న కాలంలో ఈ బార్డ్ ఏఐ చాట్‍బోట్ మరింత అత్యుత్తమంగా మారే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలో జరుగుతున్న గూగుల్ ఐ/ఓ ఈవెంట్‍లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. ఈ బార్డ్ ఏఐ చాట్‍బోట్ టూల్‍ను 180 దేశాల్లో లాంచ్ చేయటంతో పాటు వివరాలను వెల్లడించారు.
Google Bard AI Chatbot: గూగుల్ లేటెస్ట్ ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)’ PaLM 2 ఆధారంగా ఈ బార్డ్ ఏఐ టూల్ రన్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లిష్‍తో పాటు జపనీస్, కొరియన్‍లోనూ ఉంది. మొత్తంగా 40 భాషల్లో తీసుకురావాలని గూగుల్ ప్లాన్ చేసుకుంది. ఈ గూగుల్ బార్డ్ ప్రస్తుతం కోడింగ్, 40 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అడ్వాన్స్ మ్యాథ్స్, రీజనింగ్‍ను సులువుగా చేయగలదు. అలాగే అడిగిన దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు.
‘గూగుల్ బార్డ్’ను ఎలా ఉపయోగించాలంటే..
- ముందుగా గూగుల్ బార్డ్ అఫీషియల్ వెబ్‍సైట్ https://bard.google.com లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో ట్రై మీ (Tty me) బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత జీమెయిల్ అకౌంట్‍తో లాగిన్ అవ్వాలి.
- అనంతరం ప్రైవసీ పాలసీని చదివి కింద ఉన్న ఐ అగ్రీ (I Agree) బటన్‍పై క్లిక్ చేయాలి.
- అంతే ఇక గూగుల్ బార్డ్ ఏఐ చాట్‍బోట్‍ను వాడుకోవచ్చు. ప్రశ్నలను టైప్ చేసి సమాధాలను పొందవచ్చు.
త్వరలో మరిన్ని దేశాల్లో Google Bardను అందుబాటులోకి తెస్తామని పిచాయ్ వెల్లడించారు. ఈ ఏఐ చాట్‍బోట్‍కు కొత్తకొత్త ఫీచర్లు అప్‍డేట్లు తీసుకొస్తూనే ఉంటామని తెలిపారు.
టాపిక్