తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Group: అదానీ గ్రూప్ పై మళ్లీ ఆరోపణల దుమారం; ఖండించిన అదానీ సంస్థ

Adani Group: అదానీ గ్రూప్ పై మళ్లీ ఆరోపణల దుమారం; ఖండించిన అదానీ సంస్థ

HT Telugu Desk HT Telugu

31 August 2023, 12:58 IST

  • Adani Group: భారత్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన పారిశ్రామిక సంస్థల సమాహారం అదానీ గ్రూప్ ను మరోసారి వివాదాల చుట్టుముట్టాయి. హిండెన్ బర్గ్ నివేదిక వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే, అలాంటి ఆరోపణలే మరోసారి మరో సంస్థ ద్వారా తెరపైకి వచ్చాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Adani Group: భారత్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన పారిశ్రామిక సంస్థల సమాహారం అదానీ గ్రూప్ ను మరోసారి వివాదాల చుట్టుముట్టాయి. హిండెన్ బర్గ్ నివేదిక వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే, అలాంటి ఆరోపణలే మరోసారి మరో సంస్థ ద్వారా తెరపైకి వచ్చాయి.

సొంతవారి ద్వారా..

మారిషస్ లోని పలు షెల్ కంపెనీల ద్వారా అదానీ కుటుంబానికి సన్నిహితులైనవారు అదానీ గ్రూప్ లో లక్షల డాలర్లను పెట్టుబడులు పెట్టి, ఆయా కంపెనీల షేర్ల ధరలను అక్రమంగా పెంచారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) ఒక నివేదికలో ఆరోపించింది. అనంతరం, పెరిగిన ధరలకు షేర్లను మళ్లీ అమ్మివేసి భారీ లాభాలను పొందారని పేర్కొంది. 2013 నుంచి 2018 వరకు జరిగిన ఈ తరహా లావాదేవీలకు సంబంధించిన విశ్వసనీయమైన డాక్యుమెంట్లను తాము సంపాదించినట్లు వెల్లడించింది. ఈ అక్రమాలు తొలిసారి బయటపడ్డాయని వివరించింది. ఈ వివరాలను బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ ప్రముఖంగా ప్రచురించింది. బినామీల ద్వారా అదానీ కుటుంబ సభ్యులే కోట్ల డాలర్ల విలువైన అదానీ గ్రూప్ సంస్థల షేర్లను కొనుగోలు చేసినట్లు OCCRP ఆరోపించింది. ప్రస్తుతం గౌతమ్ ఆదానీ 120 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ సంపన్నుల్లో ఒకరుగా ఉన్నారు.

వినోద్ అదానీ పాత్ర

మారిషస్ వంటి పన్ను తక్కువగా ఉండే దేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా సొంత కంపెనీల షేర్లనే పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి.. ఆయా కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి, అనంతరం వాటిని మళ్లీ అధిక ధరలకు అమ్మే కుంభకోణంపై తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి గౌతమ్ అదానీ, అతడి సోదరుడు వినోద్ అదానీ అని ఓసీసీఆర్పీ (OCCRP) ఆరోపించింది. వినోద్ అదానీకి ప్రధాన వ్యాపార భాగస్వామ్యులుగా ఉన్న ఇద్దరు విదేశీయులకు చెందిన రెండు షెల్ కంపెనీల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు వెల్లడించింది.

అదానీ గ్రూప్ ఖండన

OCCRP ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. గతంలో అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా వచ్చిన హిండెన్ బర్గ్ నివేదికనే.. మార్పు చేర్పులతో మళ్లీ కొత్తగా OCCRP ద్వారా మరోసారి విడుదల చేశారని అదానీ గ్రూప్ ఆరోపించింది. అదానీ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగమే గత హిండెన్ బర్గ్ నివేదిక, ప్రస్తుత ఓసీసీఆర్పీ (OCCRP) నివేదిక అని విమర్శించింది. వినోద్ అదానీకి అదానీ గ్రూప్ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి పాత్ర లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఓసీసీఆర్పీ లో ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్ పెట్టుబడులు ఉన్నాయి. జార్జి సొరోస్ గతంలో గౌతమ్ అదానీపై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను సమర్ధించారు.

తదుపరి వ్యాసం