YSRCP Incharges : కొత్త ఇంఛార్జుల జాబితా అంటూ ప్రచారం - ఖండించిన వైసీపీ
22 December 2023, 19:57 IST
- YSRCP Latest News: వైసీపీ మరో ఎనిమిది మంది ఇంఛార్జులను మార్చిందంటూ ఓ ప్రకటన తెగ వైరల్ అవుతోంది. ఇందులో పలు కీలక స్థానాలు ఉన్నాయి. అయితే వీటిని తీవ్రంగా ఖండించింది వైసీపీ అధినాయకత్వం. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
వైసీపీ కొత్త ఇంఛార్జులు
YSRCP Incharges News: అధికార వైసీపీలో భారీ కుదుపులు చోటు చేసుకుంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పలు మార్పులు చేసిన వైసీపీ అధినాయకత్వం… తాజాగా మరో నిర్ణయం తీసుకుందంటూ ఓ ప్రకటన తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఎనిమిది నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను ప్రకటించినట్లు ఉంది. కాకినాడ రూరల్ , ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం,రామచంద్రాపురం, మండపేట, పాయకరావుపేట, రాజమండ్రి సిటీ స్థానాల పేర్లు ఉన్నాయి.
అయితే సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్న ఈ జాబితాపై వైసీపీ స్పందించింది. తమ అధికారిక ట్విట్టర్ స్పందిస్తూ… వైరల్ అవుతున్న జాబితా ఫేక్ అని స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “మా మీద విషం చల్లి, మాపై తప్పుడు కథనాలు రాసి, ఫేక్ వార్తలు క్రియేట్ చేయడమేనే మీ జీవితం.మా పార్టీ గురించి మీకెందుకు. మీ సంగతి, మీ పొత్తులు, మీ పార్టీ వ్యవహారాల గురించి చూసుకోండి ముందు. ఇప్పటికే గుప్పెడు సీట్లు ఇచ్చి మూలన కూర్చోపెట్టినా బుద్దిరాలేదు మీకు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినవారు ఒకరు, ఒక్కసారి కూడా నెగ్గలేని వ్యక్తి ఇంకోకరు. ఇలాంటి తప్పుడు దారులు మానుకోని డెమక్రటిక్ వే లో రండి. ఇంకోసారి సింహం సింగిల్ గా దర్జాగానే వస్తుంది. తప్పుడు దారుల్లో రాదు. ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి” కౌంటర్ ఇచ్చింది.
మరోవైపు ఏలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ అధిష్టానం... మార్పుచేర్పులు చేస్తుంది. ఇటీవల 11 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చిన సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లకు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం ఉంది. దీంతో ఎవరికి ఎక్కడ సీటు దక్కుతుందోనని వైసీపీ నేతలు టెన్షన్ లో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి ఆ ఫలితాల ఆధారంగా ఇన్ ఛార్జ్ లను మారుస్తుంది వైసీపీ అధిష్టానం.