Visakha News : జీవీఎంసీపై కూటమి వ్యూహం- టీడీపీ, జనసేనలోకి 21 మంది వైసీపీ కార్పొరేటర్లు?
21 July 2024, 14:05 IST
- Visakha News : రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కూటమి పార్టీలు... ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లపై ముఖ్యంగా జీవీఎంసీపై కన్నేసింది. వైసీపీ నుంచి 21 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
జీవీఎంసీపై కూటమి వ్యూహం- టీడీపీ, జనసేనలోకి 21 మంది వైసీపీ కార్పొరేటర్లు?
Visakha News : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరికతో ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు వైసీపీకి షాక్ ఇవ్వనున్నారు. జీవీఎంసీపై కూటమి పాగా వేసేందుకు వ్యూహం రచించారు. అధిక సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చర్చలు జరిగాయని సమాచారం. అయితే పార్టీ ఫిరాయిస్తున్న కార్పొరేటర్లను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
రెండు మూడు రోజుల్లో వైసీపీకి చెందిన దాదాపు 21 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని చర్చలు ముగిశాయి. రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి స్థానిక సంస్థలపై కన్ను వేసింది. అందులో ప్రధానంగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పీఠంపై కన్ను వేసింది. దాన్ని ఎలాగైనా వైసీపీ నుంచి లాక్కొవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ కూటమి నేతలు ఆ రకంగా చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీ, నేతలు ఒక హోటల్ సమావేశం అయి ఇదే అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే పి. విష్టుకుమార్ రాజు, విశాఖపట్నం ఎంపీ భరత్, టీడీపీ లోక్‌సభ అధ్యక్షుడు గండిబాబ్జీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీలో బలం పెంచుకోవాలని, తద్వారా స్టాండింగ్ కమిటీతో పాటు వైసీపీ నుంచి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే మరోవైపు తమ కార్పొరేటర్లు పార్టీ మారకుండా అడ్డుకునేందుకు, మేయర్ పీఠం వైసీపీ చేతులోనే ఉండేలా ఆ పార్టీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మేయర్ ఛాంబర్‌లో కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 30 మంది కార్పొరేటర్లు గైర్హజరు అయ్యారని తెలిసింది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి 21 మంది కార్పొరేటర్లు టీడీపీ కూటమిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 11 మంది టీడీపీ, 9 మంది జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జీవీఎంసీలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి?
జీవీఎంసీ మేయర్ పీఠం దక్కాలంటే మెజార్టీ సంఖ్యలో కార్పొరేటర్లు ఉండాలి. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 98 వార్డులున్నాయి. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను గెలుచుకుని మేయర్ పీఠాన్ని సాధించుకుంది. టీడీపీ 30 వార్డులను గెలుచుకుని ప్రతిపక్షంలో ఉంది. జనసేన మూడు వార్డులను గెలుచుకోగా, సీపీఎం, సీపీఐ, బీజేపీలు చెరొక్క వార్డును గెలుపొందాయి. అలాగే నాలుగు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లు మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొలగాని హరివెంకటకుమారికి మద్దతు ఇచ్చారు. దీంతో జీవీఎంసీలో వైసీపీ బలం 65కి పెరిగింది. 21వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ తరపున ఎమ్మెల్సీ అవ్వడంతో ఆయన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఆ వార్డుకు ఉపఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. అంటే ఇప్పుడు జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.
వైసీపీకి మద్దతు ఇచ్చిన ఇద్దరు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. దీంతో జనసేన బలం ఐదుకు పెరిగింది. అలాగే మరో ఇండిపెండెంట్ కార్పొరేటర్, 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 32కి పెరిగింది. వైసీపీ బలం 60కి తగ్గింది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో గెలుపొందింది. జీవీఎంసీ పరిధిలోని అన్ని స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమికి జీవీఎంసీ మేయర్ పీఠం కన్ను పడింది. అయితే అందుకు కనీసం 59 మంది కార్పొరేటర్ల బలం ఉండాలి. అయితే కూటమికి టీడీపీ (32), జనసేన (5), బీజేపీ (1) 38 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. మేయర్ పీఠం కావాలంటే. ఇంకా 21 మంది కార్పొరేటర్లు కావాల్సి ఉంది.
అందులో భాగంగానే వైసీపీకి చెందిన 21 మంది కార్పొరేటర్లను టీడీపీ, జనసేన పార్టీల్లో చేర్చుకోవడానికి రంగ సిద్ధం చేశారు. తద్వారా మేయర్ పీఠంపై టీడీపీ కూటమి జెండా ఎగరేయాలని అనుకుంటున్నారు. శుక్రవారం ఒక హోటల్‌లో 21 మంది కార్పొరేటర్లు టీడీపీ నేతలతో చర్చలు జరిపి, టీడీపీలో చేరేందుకు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
జులై 27 జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ పదవీకాలం
ఈ నెల (జులై) 27తో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కమిటీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీలోని పది మంది సభ్యులు ఉంటారు. వీరిని 97 మంది కార్పొరేటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరికల తరువాత కూటమి బలం 54కి పెరిగే అవకాశం ఉంది. దీంతో స్టాండింగ్ కమిటీలోని 10 స్థానాలను కూటమి పార్టీలే సొంతం చేసుకునే అవకాశం ఉంది. అందుకే వైసీపీ నుంచి చేరికలు తరువాత జులై నెల ఆఖరులోపే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆగస్టు 3న జీవీఎంసీ సమావేశం నిర్వహించి, మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి టీడీపీ కూటమి సిద్ధపడుతుంది.
మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టడం సాధ్యం కాదు
మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం టీడీపీ కూటమి ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం నాలుగేళ్ల పదవీకాలం పూర్తి కావాల్సి ఉందనే మున్సిపల్ చట్టంలోని నిబంధన ఉంది. కనుక మేయర్ పీఠం టీడీపీ కూటమికి అప్పుడే దక్కకపోవచ్చు. అయితే మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన క్లాజ్‌ను సవరించాల్సి ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ మున్సిపల్ చట్టాన్ని సవరిస్తే తప్ప జీవీఎంసీ మేయర్ పీఠం కూటమికి దక్కదు. ఎందుకంటే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు. చట్టాన్ని సవరించకపోతే 2025 వరకు వైసీపీ చేతులోనే మేయర్ పీఠం ఉంటుంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు