ADR Report : ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS టాప్ - ఖర్చుల్లో వైసీపీ సెకండ్ ప్లేస్, లెక్కలివే..!-brs tops the income chart among regional parties for the year 2022 23 with rs 737 6 crore adr report read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adr Report : ప్రాంతీయ పార్టీల ఆదాయంలో Brs టాప్ - ఖర్చుల్లో వైసీపీ సెకండ్ ప్లేస్, లెక్కలివే..!

ADR Report : ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS టాప్ - ఖర్చుల్లో వైసీపీ సెకండ్ ప్లేస్, లెక్కలివే..!

Association for Democratic Reforms Report : అత్యధిక ఆదాయం ఉన్న ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ మొదటి స్థానంలో(రూ.737.67 కోట్లు) నిలిచింది. ఖర్చు చేయటంలో టీఎంసీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఆదాయంలో బీఆర్ఎస్ టాప్

Association for Democratic Reforms Report : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్‌కు రూ. 737.67 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించిన 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38 శాతానికి సమానంగా ఉంది.

ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆయా రాజకీయ పార్టీల ఆదాయంతో పాటు ఖర్చుల వివరాలను పేర్కొంది.

ఖర్చు చేయటంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ రూ.181.18 కోట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.79.32 కోట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రూ.57.47 కోట్ల ఖర్చుతో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో రూ.52.62 కోట్లతో డీఎంకే నిలవగా…. రూ.31.41 కోట్లతో సమాజ్‌వాది పార్టీ ఉంది.

ఆదాయంలో టీఎంసీది సెకండ్ ప్లేస్….

ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై ఏడీఆర్ నివేదికను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 57 ప్రాంతీయ పార్టీలలో 39 పార్టీల ఆదాయ, వ్యయాలను ఇందులో పేర్కొంది. BRS పార్టీ తర్వాత… TMC అత్యధిక ఆదాయాన్ని (రూ. 333.45 కోట్లు) కలిగి ఉంది. డీఎంకే రూ. 214.3 కోట్లతో మూడో స్థానంలో నిలవగా… 181 కోట్ల రూపాయలు ఉన్న బీజేడీ నాలుగో స్థానంలో నిలిచింది.

39 ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రకటిత ఆదాయం రూ. 1,740.4 కోట్లుగా ఉందని ఏడీఆర్ తన విశ్లేషణలో బహిర్గతం చేసింది. ఇందులో మొదటి ఐదు పార్టీల ఆదాయమే రూ. 1,541.3 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.

రాజకీయ పార్టీల వార్షిక ఆడిట్ చేసిన ఖాతాలను సమర్పించడానికి ఎన్నికల సంఘం… అక్టోబర్ 31, 2023ని గడువుగా నిర్ణయించింది. అయితే వీటిలో 16 ప్రాంతీయ పార్టీలు మాత్రమే కాలపరిమితికి కట్టుబడి ఉన్నాయి. 23 పార్టీలు తమ నివేదికలను ఆలస్యంగా సమర్పించాయని ఏడీఆర్ వివరించింది.

శివసేన శిందే వర్గం, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్దవ్ శివసేన వంటి ప్రముఖ పార్టీలు సహా 18 ప్రాంతీయ పార్టీల 2022-23 ఆర్థిక సంవత్సర ఆడిట్ నివేదికలు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ఏడీఆర్ పేర్కొంది.

బీఆర్ఎస్‌కు ఖర్చులుపోనూ అత్యధికంగా రూ.680.20 కోట్ల ఆదాయం మిగిలిందని ఏడీఆర్ పేర్కొంది. బిజూ జనతాదళ్‌కు రూ.171.06 కోట్లు, డీఎంకేకు రూ.161.72 కోట్ల ఆదాయం దక్కింది.

ఇక 20 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని పేర్కొన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో ప్రస్తావించింది. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులు 490.43 శాతం ఎక్కువ ఉన్నాయని వెల్లడించినట్లు తెలిపింది.

ఆయా రాజకీయ పార్టీలకు ప్రధానంగా స్వచ్ఛంద వివరాళాలు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే ఆదాయం వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. వీటి విలువనే మొత్తం రూ. 1,522.46 కోట్లు లేదా మొత్తం ఆదాయంలో 87.4 శాతంగా ఉందని విశ్లేషించింది.