Agrigold Land Scam Case : జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరు
23 August 2024, 18:58 IST
- అగ్రి గోల్డ్ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజీవ్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
జోగి రాజీవ్ కు బెయిల్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఊరట దక్కింది. అగ్రిగోల్ట్ భూముల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆయనకు… విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజారు చేసింది. ఈ కేసులో జోగి రాజీవ్‌తో పాటు సర్వేయర్ రమేష్‌ను కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్‌తో పాటు సర్వేయర్ రమేష్‌కు కూడా బెయిల్ మంజూరైంది.
విజయవాడ రూరల్ మండలంలో కబ్జాకు గురైన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో సూత్రదారులను గుర్తించే పనిలో ఏసీబీ ఉంది. రెండేళ్లుగా పథకం ప్రకారం భూముల్ని కబ్జా చేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలోనే జోగి రమేశ్ కుమారుడిని అరెస్ట్ చేసింది. రెవెన్యూ, సర్వే, రిజస్ట్రేషన్ శాఖల అధికారులతో కలిసి ఈ దందాకు పాల్పడినట్టు ఏసీబీ అనుమానిస్తోంది.
అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి నిర్వహించిన సర్వేలో తాను సంతకాలు చేయలేదని గ్రామ సర్వేయర్ దేదీప్య ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పాటు భూముల విక్రయానికి సంబంధించి జోగి రాజీవ్, జోగ వెంకటేశ్వరరావులకు తాను ఎలాంటి భూమి విక్రయించలేదని విక్రేత కూడా వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఈ మొత్తం బోగస్ వ్యవహారమని ఏసీబీ అనుమానిస్తోంది.
సీఐడీ జప్తులో ఉన్న భూమిని కాజేయడానికి పథకం ప్రకారం తప్పుడు పత్రాలను సృష్టించి ఉంటారని ఏసీబీ భావిస్తోంది. మంత్రిగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని జోగి రమేశ్ నడిపించారని అనుమానిస్తోంది.
మాజీ మంత్రి జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్..
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. సెప్టెంబరు 3న తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల నోటీసులు అందుకున్న రమేశ్…. విచారణకు కూడా హాజరయ్యారు.