TTD Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్లు - భారీగా జీతం, ముఖ్య వివరాలివే
02 November 2024, 9:05 IST
- టీటీడీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. టీటీడీ పుడ్ ల్యాబోరేటరీలో కూడా ఒక పోస్టును భర్తీ చేయనున్నారు.
టీటీడీ రిక్రూట్ మెంట్
పలు ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్లు ఇచ్చింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ కాగా… టీటీడీ ల్యాబోరేటరీలో ఒక పోస్టును రిక్రూట్ చేయనున్నారు. ఈ మేరకు వేర్వురుగా ప్రకటనలు ఇచ్చారు. ఈ మూడు పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ అనస్తటిస్ట్(01), పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్(01) పోస్టులను భర్తీ చేయనున్నారు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటంది. వైద్య విద్య పూర్తి చేయటంతో పాటు పీజీ కూడా ఉత్తీర్ణత సాధించాలి.పని చేసిన అనుభవం ఉండాలి. వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400 జీతం చెల్లిస్తారు. దరఖాస్తు ఫారమ్ లో విద్యార్హతలతో పాటు పని చేసిన అనుభవం వివరాలను క్లుప్తంగా ఇవ్వాలి. ఏమైనా తప్పులు ఉంటే దరఖాస్తును రిజెక్ట్ చేస్తారు.
దరఖాస్తులను https://www.tirumala.org/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఇంటర్వులకు పిలుస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను ‘ ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, BIRRD దగ్గర, తిరుపతి- 517507’ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పుట్టిన తేదీ ధ్రువపత్రం, విద్యార్హత పత్రాలు, పని చేసిన అనుభవం పత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్, ఎంసీఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రంతో పాటు కమ్యూనిటీ ధ్రువపత్రం, రెండు పాస్ ఫొటోలు అటాచ్ చేయాలి.
మరోవైపు టీటీడీ వాటర్ అండ్ పుడ్ ల్యాబోరేటరీలో ఒక పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. HOD/QUALITY MANAGER పోస్టుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 62 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకునే వారు… కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, డైరీ కెమిస్ట్రీ, పుడ్ సెఫ్టీ, పుడ్ టెక్నాలజీలో కానీ మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం పదేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
దరఖాస్తులను https:// www.tirumala.org వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన తర్వాత మార్కెటింగ్ గోడాన్ ఫస్ట్ ఫ్లోర్, గోశాల పక్కన, తిరుమల- 517504 చిరునామాకు పంపించాలి. నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లు పని చేయాలి.