TG DSC Results 2024 : డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్.. వెబ్ సైట్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫామ్! ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరి ధ్రువపత్రాల పరిశీలన తర్వాత.. నియామక పత్రాలను అందజేస్తారు.
తెలంగాణ డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు అందుబాటులోకి వచ్చాయి. ధ్రువపత్రాల పరిశీలన తేదీలు కూడా ఖరారయ్యాయి. అయితే అభ్యర్థులకు విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం వెరిఫికేషన్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- డీఎస్సీ అభ్యర్థులు https://tgdsc.aptonline.in/tgdsc/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో డౌన్లోడ్ టీజీ డీఎస్సీ 2024 వెరిఫికేషన్ Proforma అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దీనిపై క్లిక్ చేసి మీకు ధ్రువపత్రాల వెరిఫికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- ఇందులో అడిగిన వివరాలను నింపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.
మరోవైపు అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కానీ చాలా జిల్లాల్లో మెరిట్ జాబితాలు విడుదల కాలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గరువుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది అభ్యర్థులు డీఈవో కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ఇవాళ పలు జిల్లాలకు సంబంధించిన ఎస్టీటీ మెరిట్ లిస్ట్ ను విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల జాబితాలు కూడా విడుదల కానున్నాయి.
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… అక్టోబర్ 5 వరకు వెరిఫికేషన్ ఉంటుంది.ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్ లో సమాచారం కూడా అందనుంది.
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన వెరిఫికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని వివరాలను నింపాలి. ఇందులో డీఎస్సీ హాల్ టికెట్ నెంబర్, విద్యార్హతలు, టెట్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఇటీవలనే విడుదలయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6508, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 182, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 220, సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 796పోస్టులు ఉన్నాయి.