తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : రేపు తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు

Tirumala : రేపు తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు

HT Telugu Desk HT Telugu

08 September 2024, 21:11 IST

google News
    • Tirumala : తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం నిర్వహించారు. తిరుమలనంబి ఆలయంలో ఉద‌యం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు తిరుమ‌లనంబి జీవిత చ‌రిత్రపై ఉప‌న్యసించ‌నున్నారు.
రేపు తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు
రేపు తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు

రేపు తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు

Tirumala : ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం రేపు (సోమవారం) తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా తిరుమలనంబి ఆలయంలో ఉద‌యం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు తిరుమ‌లనంబి జీవిత చ‌రిత్రపై ఉప‌న్యసించ‌నున్నారు. శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన తిరుమలనంబి వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారు.

ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వర‌స్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాపవినాశ‌నం తీర్థం నుంచి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుంచి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు.

అందుకు తిరుమలనంబి బాధపడుతూ "వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా" అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుంచి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుంచి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని పేరు ఏర్పడింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 10న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 15న సాయంత్రం ప‌విత్రోత్సవాల‌కు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం