Tiger Attacks In WG: పశ్చిమ గోదావరిలో పులి కలకలం.. పశువులపై దాడులు
29 January 2024, 8:58 IST
- Tiger Attacks In WG: పశ్చిమగోదావరి జిల్లా వాసుల్ని పులి బెంబేలెత్తిస్తోంది. పాపి కొండల మీదుగా అడవుల్ని దాటుకుని జనావాసాల్లోకి వచ్చి బెంబేలెత్తిస్తోంది.
దెందులూరులో అటవీ శాఖ అధికారుల గాలింపు
Tiger Attacks In WG: కొద్ది నెలల క్రితం ఉత్తరాంధ్ర జిల్లాను వణికించిన పెద్దపులి అలజడి ఈ సారి పశ్చిమగోదావరి జిల్లాలో మొదలైంది. కొద్ది రోజులుగా పోలవరం కుడికాల్వ వెంబడి ఉన్న గ్రామాల్లో పశువులపై పులి దాడి చేస్తోంది. పంట పొలాల్లో పాదముద్రల్ని బట్టి పెద్ద పులిగా నిర్ధారణ కావడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.మునుపెన్నడు లేని విధంగా గ్రామాల్లోకి పెద్దపులి ఎందుకు చొరబడిందనే సందేహం అందర్నీ వేధిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొద్దిరోజులుగా పెద్ద పులి అలజడి సృష్టిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు తనికీలు చేపట్టారు. పులి తిరిగిన ప్రదేశాలను ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, (వన్యప్రాణుల విభాగము) చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. ఏ.కె.నాయక్, రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారి వై.శ్రీనివాస రెడ్డి, రాజమహేంద్రవరం డి ఎఫ్ వోలు ఏ.త్రిమూర్తులు రెడ్డి, రవీంద్ర ధామ పరిశీలించారు.
పెద్దపులి విషయంపై ఎలాంటి సమాచారం తెలిసినా టోల్ ఫ్రీ నెం. 1800-425-5909 తెలియచేయాలని సూచించారు. పులి కదలికలను నిరంతరం గమనించేందుకు అటవీశాఖ సిబ్బందిని బృందాలుగా నియమించినట్టు అటవీ అధికారులు తెలిపారు.
ఆదివారం పెదవేగి మండలం ముండూరుతో పాటు దెందులూరు మండలం మేదినవారిపాలెం గ్రామ సమీపంలో పులి సంచారాన్ని గుర్తించారు. దాదాపు 13ఏళ్ల పులిగా నిర్ధారించారు. పాపికొండల మీదుగా అభయారాణ్యం దాటుకుని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
పులి సంచారం నేపథ్యంలో గ్రామాలలో ప్రజలు, వారి పశువులకు ఏ విధమైన హాని జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఏలూరు సెక్షన్ రామసింగవరం బీట్ పరిధిలో గల దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామ సమీపంలో సంచరిస్తున్న జంతువు పాద ముద్రల పరిశీలించిన అధికారులు పెద్దపులి పాదముద్రలుగా గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రధామ వివరించారు.
ఏలూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఏలూరు సెక్షన్ రామసింగవరం బీట్ పరిధిలోని దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటలో శరీరంపై బంగారు మచ్చలు కలిగిన జంతువును 26వ తేదీన రైతులు గమనించారు. దానిని పెద్ద పులిలా ఉందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రదేశాన్ని అటవీశాఖ సిబ్బంది క్షుణంగా పరిశీలించిన తర్వాత ఆ ప్రదేశంలో 18 సె.మీ. నిలువుగా 18 సె.మీ. అడ్డంగా ఉన్న పాదముత్రలు గుర్తించారు. అవి పెద్దపులియొక్క పాదముద్రలుగా ప్రాధమికంగా నిర్ధారించారు.
గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తుందన్న వార్త సమీప గ్రామాల ప్రజలకు తెలియడంతో వారు భయభ్రాంతులకు గురికాకుండా అటవీశాఖ సిబ్బందిని టీమ్ లుగా విభజించి పెద్దపులి యొక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు.
పశ్చిమగోదావరిలో కనిపించిన పెద్దపులి వల్ల ఇప్పటి వరకు ప్రజలకు ఎటువంటి హానీ జరగలేదని గ్రామ ప్రజలు అడవి జంతువు సంచరిస్తున్న ప్రదేశంనకు ఒంటరిగా వెళ్లరాదని, గేదెలను, ఆవులను, మేకలను సదరు ప్రదేశానికి తొలుకొని వెళ్లరాదని సూచనలు ఇచ్చారు.
పెద్దపులి కదలికలు గురించి సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంతువు గురించి ఎటువంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే అటవీ శాఖకు సంబంధించిన టోల్ ప్రీ నెంబరు.1800-425-5909 కు తెలియజేయాలని ఆయన కోరారు. పెద్దపులి వల్ల పెంపుడు జంతువులకు, ప్రజలకు నష్టం జరిగితే వెంటనే పైన తెలిపిన టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వారికి వెంటనే అటవీశాఖ ద్వారా నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు.
పశువుల పాకల వద్ద రాత్రిపూట ఎక్కువ వెలుతురు వచ్చే విధంగా దీపాలను ఏర్పాటు చేసుకోవాలని రాత్రి సమయంలో బయట తిరగరాదని హెచ్చరించారు. పులికి ప్రజలు ఎవరైనా ఉద్ధేశ్య పూర్వకంగా గాయపరచటం, చంపటం కానీ చేస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు.