తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కొందరికి ఫ్యామిలీ ప్యాక్.. మరికొందరికి ఉపవాసం.. టీడీపీలో టికెట్ల గోల

కొందరికి ఫ్యామిలీ ప్యాక్.. మరికొందరికి ఉపవాసం.. టీడీపీలో టికెట్ల గోల

HT Telugu Desk HT Telugu

26 March 2024, 11:32 IST

google News
    • టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించిన పాలసీకి విరుద్ధంగా ఒక్కో కుటుంబానికి నాలుగేసి మూడేసి టికెట్లు ఇచ్చి, మరికొందరు సీనియర్ నేతలకు మాత్రం మొండిచేయి చూపడంతో ఆ పార్టీలో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో) (ANI )

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో)

టిడిపిలో కష్టపడి పనిచేసిన వారికి ఒక వైపు మొండి చేయి చూపిస్తూ, మరోవైపు డబ్బుండి లాబీయింగ్ చేసుకున్న వారికే పెద్ద పీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు లేవని తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇక పార్టీ కోసం కుటుంబం మొత్తం కష్టపడినప్పటికీ, కొందరికీ మాత్రమే ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వడం పట్ల పార్టీలో సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ఒక కుటుంబానికి ఒకే సీటు పాలసీతో చంద్రబాబు కొందరికి మొండి చేయి చూపించారు. కానీ అదే పాలసీని బ్రేక్ చేసి ఒక్కో కుటుంబానికి నాలుగేసి, మూడేసి, రెండేసి స్థానాలు కట్టబెట్టడంపై టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహిస్తున్నారు. పార్టీలో అందరికీ ఒకే పాలసీ ఉండాలని, పాలసీ కొంత మందికి మినహాయింపు ఉండకూడదని విమర్శిస్తున్నారు.‌ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా పార్టీలో పాలసీ ఉండాలని, కానీ చంద్రబాబు మాటలకి, చేతలకి పొంతన ఉండడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

ఒక కుటుంబానికి, ఒక సీటు విధానం పేరుతో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, పరిటాల సునీత, జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు చంద్రబాబు రెండో టిక్కెట్టును నిరాకరించారు. అదే చంద్రబాబు తన కుటుంబానికి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబానికి నాలుగేసి స్థానాలు, మాజీ మంత్రి అచ్చెంనాయుడు కుటుంబానికి మూడు స్థానాలు, ఇటీవలి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి రెండు స్థానాలు కేటాయిచారు.

ఆ కుటుంబాలకి 4+4+3+2 టిక్కెట్లు

చంద్రబాబు తన కుటుంబంలో తన (కుప్పం అసెంబ్లీ)తో పాటు తన తనయుడు లోకేష్‌కి మంగళగిరి అసెంబ్లీ, తన వియ్యంకుడు బాలకృష్ణకి హిందూపురం, వియ్యంకుడి అల్లుడు భరత్‌కు విశాఖపట్నం ఎంపీ స్థానం కేటాయించారు. అంటే నాలుగు స్థానాలు కేటాయించుకున్నారు.‌

అలాగే యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమార్తె యనమల దివ్యకు తుని అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అల్లుడు మహేష్ యాదవ్‌కి ఏలూరు ఎంపీ టికెట్, వియ్యంకుడు సుధాకర్‌కి కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.

అలాగే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు టెక్కలి‌ అసెంబ్లీ టిక్కెట్టు, ఆయన అన్న ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకి శ్రీకాకుళం ఎంపీ టిక్కెట్, రామ్మోహన్ నాయుడు బావ, చెల్లెలు భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కి రాజమండ్రి సిటీ అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చారు.

ఇక ఇటీవలి వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపి టిక్కెట్, ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి నెల్లూరు జిల్లా కొవ్వురు అసెంబ్లీ టిక్కెట్ కట్టబెట్టారు.

ఇదేం తీరంటున్న సీనియర్లు

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు టిడిపి పుట్టినప్పటి నుండి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.‌ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం పార్టీ కోసమే పని చేసే అతి కొందరిలో ఆయనొక్కడు. పార్టీపై, పార్టీ అధినేతపై ప్రత్యర్థుల విమర్శలకు తనదైన శైలిలో పదునైన విమర్శలతో ఎదురుదాడి చేస్తారు.‌

గత ఐదేళ్లలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పార్టీపై దాడి జరిగినప్పుడు టిడిపిలో సీనియర్లుగా ఉన్న యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు వంటి‌ నేతలు పెద్దగా ప్రతిస్పందించలేదు. ఆ సందర్భంలో అయ్యన్నపాత్రుడు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో ఎక్కడ టిడిపి సభలు జరిగి‌నా అక్కడికి వెళ్లడం, జగన్ ప్రభుత్వంపై విమర్శలు ప్రతిదాడులకు దిగేవారు. తన ఛలోక్తులతో సభికులను ఉత్సాహ పరిచి, నవ్వించేవారు. గత ఐదేళ్లలో టిడిపి నేతల్లో అందరికంటే ఎక్కవ కేసులు నమోదు అయింది కూడా అయ్యన్న పాత్రుడి మీదనే.

అనేక సార్లు అరెస్టు కూడా అయ్యారు. మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కొడెల శివప్రసాద్ మరణం‌ సందర్భంలో, అక్కడికెళ్లి జగన్ ప్రభుత్వంపై‌ చేసిన విమర్శలు సంచలనం అయ్యాయి. అయ్యన్నపాత్రుడు తనకు ఎమ్మెల్యే, తన కుమారుడికి ఎంపీ టికెట్ అడిగారు. ఆయన కుమారుడు కూడా గత పదేళ్లుగా టిడిపిలోనే ఉన్నారు. కానీ చంద్రబాబు, అయ్యన్నపాత్రుడుకి నర్సీపట్నం అసెంబ్లీ స్థానం మాత్రమే కేటాయించారు. అయ్యన్న తనయుడు చింతకాయల విజయ్‌కి అనకాపల్లి ఎంపి టిక్కెట్టు ఇవ్వలేదు. ఆ కుటుంబానికి ఒక్కటే టికెట్ కేటాయించారు.

సునీతమ్మ వర్గీయుల్లో అసంతృప్తి

అలాగే అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం మంచి‌ గుర్తింపు పొందింది. ఆ కుటుంబం కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి టిడిపిలోనే ఉంది. పరిటాల రవి హత్య తరువాత, ఆయన‌ భార్య సునీత, తనయుడు శ్రీరామ్ రాజకీయాల్లోకి‌ వచ్చారు. ఆ కుటుంబం కూడా రెండు టిక్కెట్లు ‌అడిగింది. పరిటాల సునీత, శ్రీరామ్‌కు రాప్తాడు, ధర్మవరం అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరారు. ఆ రకంగా వాళ్లు క్షేత్రస్థాయిలో పని చేసుకుంటున్నారు. అయితే ఆ కుటుంబానికి కూడా చంద్రబాబు ఒకే టికెట్ కేటాయించారు. పరిటాల సునీతకు రాప్తాడు అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించి, తనయుడు‌ శ్రీరామ్‌కి మాత్రం ధర్మవరం కేటాయించలేదు.‌ దీంతో సునీతమ్మ వర్గీయుల్లో అసంతృప్తి ఉండిపోయింది.

జేసీ కుటుంబానికి నిరాకరణ

అలాగే అనంతపురంలో‌ మరో ఫ్యామిలీ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయంగా మంచి గుర్తింపు పొందింది. ఆ కుటుంబానికి కూడా ఒకే టిక్కెట్టు ఇచ్చారు.‌ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డికి తాడిపత్రి అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించగా, జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డికి మాత్రం అనంతపురం ఎంపి‌ టిక్కెట్ ఇవ్వలేదు.‌ రెండు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు.

తమకు వర్తించే ఒక‌ కుటుంబానికి ఒక టిక్కెట్టు సూత్రం చంద్రబాబు, యనమల, అచ్చెంనాయుడు విషయంలో ఎందుకు వర్తించలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్న వారిని, సీనియర్లను పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. మరో వైపు చూస్తే అసలు టిడిపికి ఏ మాత్రం సంబంధం లేని వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సైకిలెక్కగానే ఆయనకు ఆయన సతీమణికి రెండు టికెట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు.. కేవలం డబ్బు ఉందని టికెట్లు ఇస్తున్నారని వ్యాఖ్యానాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కష్టపడిన వారికి గుర్తింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఒక్క టికెట్ కూడా దక్కని వారు చాలా మంది ఉన్నారు. వారంతా తాము ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుతోనే కొలుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కుటుంబాలు సైతం కష్టపడినా కొందరికీ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చి తమను ఉపవాసం ఉంచుతున్నారని వాపోతున్నారు.

తదుపరి వ్యాసం