Atchannaidu : కీలక పదవుల్లో సొంత సామాజిక వర్గం అధికారులు, సీఎం జగన్ సమాధానం చెప్పాలంటున్న అచ్చెన్నాయుడు
Atchannaidu : జగన్ ప్రభుత్వం కీలక శాఖల్లో సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులను పెట్టుకుని దోపిడి చేస్తుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇతర వర్గాల్లో సమర్థులైన అధికారులు లేరా అని ప్రశ్నించారు.
Atchannaidu : వైసీపీ ప్రభుత్వం ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్ట్ లలో పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్రంలోని వివిధ సర్వీసుల నుంచి 16 మందిని డిప్యూటేషన్ పై తీసుకు రాగా వారిలో 10 మంది జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే అంటూ లిస్ట్ విడుదల చేశారు. కీలక శాఖలలో సొంత సామాజికవర్గ అధికారులను నియమించి జగన్ దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సొంత వర్గం అధికారులతో రాష్ట్రాన్ని దోచేస్తూ, ప్రశ్నించిన బడుగుల ప్రాణాలు తీస్తున్నారన్నారు. రాష్ట్రంలో, ఇతర వర్గాల్లో సమర్థులైన అధికారులు లేరా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఒకే వర్గం అధికారులకు పెత్తనం, కీలక పదవుల్లో నియమించడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డిప్యూటేషన్ పై అధికారులు
"ఇసుక దందాకు వెంకట్ రెడ్డిని తెచ్చారు. దోపిడీని ప్రశ్నించిన వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేశారు. మద్యంలో సొంత బ్రాండ్ల ద్వారా జగన్ దోపిడిని ప్రశ్నించిన ఓమ్ ప్రకాష్ అనే దళిత యువకుడిని చంపేశారు. డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి ధర్మారెడ్డికి టీటీడీ ఈఓ పదవి కట్టబెట్టారు. తిరుమల పవిత్రత దెబ్బతీశారు. కోస్ట్ గార్డ్ సర్వీస్ జి.వి. వెంకట రెడ్డికి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ పోస్ట్ ఇచ్చారు. ఆయనకు గనుల గురించి ఏమి తెలుసు. ఇప్పటికే రూ.40 వేల కోట్లు దోచేశారు.రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వాసుదేవ రెడ్డికి ఏపీ బెవరేజస్ కార్పోరేషన్ ఎండీ ఇచ్చి సొంత బ్రాండ్స్ తో అవినీతి చేస్తున్నారు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి ఐ అండ్ పీఆర్ కమిషనర్ కట్టబెట్టారు. రైల్వే పర్సనల్ సర్వీస్ రమణా రెడ్డి కి ఎన్.ఆర్.ఇ.డి. క్యాప్ విసి అండ్ ఎండీ, రైల్వే అకౌంట్ సర్వీస్ మధుసూధన్ రెడ్డికి ఫైబర్ నెట్ ఎండీ, రైల్వే పర్సనల్ సర్వీస్ రెడ్డి సి.ఎన్. దివాన్ రెడ్డికి విద్యా మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఎండీ, ఐఆర్ఎస్ చిలకల రాజేశ్వర్ రెడ్డికి స్పెషల్ కమిషనర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఐఆర్ఎస్ ఎం. రమణారెడ్డికి సీఇఓ ఏపీ టవర్స్ పోస్ట్, కేంద్రంలో చీఫ్ ఇంజినీర్ ఎస్.వి.కె. రెడ్డికి వాటర్ వేస్ సీఈఓ పదవులు కట్టబెట్టారు. వీటికి సీఎం జగన్ సమాధానం చెప్పగలరా? . అక్రమాలకు పాల్పడిన అధికారులు రేపు రాష్ట్రం వదిలి పారిపోయినా వదిలేది లేదు" - అచ్చెన్నాయుడు