JVD Funds Issue: విద్యాదీవెనకు జగన్ టోకరా, ట్యూషన్ ఫీజులు కట్టాలని కాలేజీల ఒత్తిడి, ఆందోళనలో విద్యార్ధులు
20 June 2024, 10:34 IST
- JVD Funds Issue: విద్యార్ధులకు విద్యాదీవెన నిధులు చెల్లించకుండానే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో దాదాపు పదిలక్షల మంది విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
చివరి విడత విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో మాజీ సిఎం జగన్ (ఫైల్)
JVD Funds Issue: జగనన్న విద్యాదీవెన బటన్ నొక్కినా తల్లుల ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో ఇప్పుడు ఫీజులు కట్టాలని కాలేజీలు విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించకుండానే ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఎన్నికలకు షెడ్యూల్ రావడానికి ముందే విడుదల చేసినా డబ్బులు మాత్రం విద్యార్ధుల ఉమ్మడి ఖాతాలకు చేరలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను 2019కు ముందున్న పేర్లుగా మార్చింది. స్కాలర్‌షిప్ చెల్లింపు విషయంలో మాత్రం స్పష్టత లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల బటన్ నొక్కుడుకే పరిమితం అయ్యింది. ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న లక్షలాది మంది విద్యార్ధులకు స్కాలర్ షిప్ డబ్బులు అందకుండానే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. దీంతో విద్యా సంవత్సరం పూర్తైన వారితో పాటు ఇంజనీరింగ్ విద్యార్ధులు, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్ధులపై యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి.
రాష్ట్రంలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్ధులకు రెండో సెమిస్టర్ పరీక్షలు రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. జేఎన్‌టియూ పరిధిలోని కాలేజీలతో పాటు ఇతర యూనివర్శిటీల పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్దులకు ట్యూషన్ ఫీజులు అందకపోవడంతో ఫీజు రియంబర్స్‌మెంట్ సదుపాయం ఉన్న విద్యార్ధుల్ని పరీక్షలకు అనుమతించమని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి.
ప్రమాదంలో పదిలక్షల మంది విద్యార్ధులు…
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటి సదుపాయాలు, ఫ్యాకల్టీ, రేటింగులను బట్టి ఫీజులు ఉన్నాయి. మంచి కాలేజీల్లో సగటున రూ.77వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా మొదటి విడతగా రూ.19వేలు మాత్రమే విద్యార్ధుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన ఫీజు చెల్లించకపోతే హాల్ టిక్కెట్లను ఇవ్వమని కాలేజీలు తెగేసి చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇలా ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా చదువుకుంటున్న విద్యార్ధులు దాదాపు పదిలక్షల మంది ఉన్నారు.
కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులో సగమైనా చెల్లిస్తే తప్ప పరీక్షలకు హాజరు కానివ్వమని, సెకండియర్ తరగతులు మొదలయ్యేలోపు మొదటి సంవత్సరం బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ప్రైవేట్ కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. నిరుపేద విద్యార్ధులు ఇప్పటికిప్పుడు ఫీజు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
మార్చిలోనే బటన్ నొక్కారు….
విద్యార్దులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను త్రైమాసికం వారీగా చెల్లిస్తున్నారు. అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్ధులకు రూ.708.68 కోట్లను గత మార్చిలో కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి విడుదల చేశారు. గతంలో ట్యూషన్ ఫీజులు నేరుగా కాలేజీలకు అందేవి. వాటిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ విద్యార్ధితో పాటు తల్లి పేరిట తెరిచిన ఉమ్మడి ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే బటన్ నొక్కినా ఫలితాలు విడుదలయ్యే వరకు వారి ఖాతాల్లో డబ్బులు పడలేదు.
పేదరికం సంకెళ్లు తెంపేందుకు విద్య ఉపయోగపడాలని విద్యాదీవెన అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్నా డబ్బులు మాత్రం విద్యార్ధులకు అందలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రుపాయలు చెల్లించారు. కోడ్‌కు ముందు బటన్ నొక్కి పోలింగ్‌కు ముందు నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నించి భంగపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు.. అంటే పెద్ద చదువులు చదువుతున్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేశామని జగన్ చెప్పుకున్నారు. చివరి విడత బటన్ నొక్కి విడుదల చేసిన రూ.708కోట్లతో కలుపుకుని ఐదేళ్లలో రూ.12,609కోట్లను విద్యాదీవెనకు ఖర్చు చేశామని చెప్పారు. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి కోసం మరో రూ.4275 కోట్లు ఖర్చు చేశామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. వసతి దీవెన కింద రూ.1100 కోట్లను విడుదల చేయాల్సి ఉంది.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పదేపదే చెప్పుకున్న జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు విడుదల చేసిన నిధులు లబ్దిదారులకు అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.