తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Videshi Vidya Scheme: విదేశీ విద్యా దీవెనలో ఎవరు ఎక్కువ లబ్ది పొందారంటే..!

Videshi Vidya Scheme: విదేశీ విద్యా దీవెనలో ఎవరు ఎక్కువ లబ్ది పొందారంటే..!

Sarath chandra.B HT Telugu

21 December 2023, 4:30 IST

google News
    • Videshi Vidya Scheme: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా ఏ సామాజిక వర్గాలకు ఎంత లబ్ది చేకూరిందో తెలుసా... గతంలో కంటే మెరుగ్గా అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న ఈ పథకంలో మెజార్టీ లబ్దిదారులు ఎవరంటే...?
విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేస్తున్న సిఎం జగన్
విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేస్తున్న సిఎం జగన్

విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేస్తున్న సిఎం జగన్

Videshi Vidya Scheme: జగనన్న విదేశీ విద్యా దీవెన.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం స్థానంలో 2022లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది ప్రారంభమైంది.

ఎస్సీల్లో….

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మూడు విడతల్లో 31మంది ఎస్సీ విద్యార్ధులు ఎంపికయ్యారు. వీరికి రూ.2,48,17,023రుపాయలు ఖర్చు కానుంది. తాజాగా మరో ఆరుగురు ఎస్సీ విద్యార్ధులు ప్రభుత్వ ప్రమాణాల మేరకు నిర్దేశించిన విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించారు. వారికి రూ.67,53,256 ఖర్చు కానుంది. మొత్తం 37మంది విద్యార్ధులకు రూ.3,15,70,279 ఖర్చు కానుంది.

ఇప్పటి వరకు ఒక్కరే…

ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఎస్టీ విద్యార్ధి కూడా పథకానికి అర్హత సాధించలేదు. నాలుగో విడతలో ఒక్కరు అర్హత సాధించారు. ఆ విద్యార్ధికి రూ.5లక్షలు మంజూరు చేశారు.

బీసీ కులాలకు అంతంతే…

బీసీ విద్యార్ధుల్లో ఇప్పటి వరకు 76మంది విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హత పొందారు. వీరికి 2,3,4 ఇన్‌స్టాల్‌మెంట్‌‌ రూపంలో రూ.6,43,40,966 చెల్లించాల్సి ఉంది. తాజాగా మరో 10మంది విద్యార్ధులు పథకానికి అర్హత సాధించగా వారికి రూ.1,48,09,379 చెల్లించారు. మొత్తం 86మంది విద్యార్ధులకు రూ.7,91,5,345 రుపాయలు ఖర్చు చేస్తున్నారు.

మైనార్టీలది అదే పరిస్థితి…

ముస్లిం మైనార్టీ విద్యార్ధుల్లో ఇప్పటి వరకు 29మందికి విదేశీ విద్యా దీవెన పథకం అందుతోంది. వారికి రూ.2,60,73,000 చెల్లించనున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎంపికయ్యారు. వారికి రూ.32లక్షలు విడుదల చేశారు. మొత్తం 31మంది ముస్లిం విద్యార్ధులకు రూ.2,92,73,000 చెల్లించనున్నారు.

క్రిస్టియన్లలో కొందరే…

క్రిస్టియన్ మైనార్టీ విద్యార్ధుల్లో 8మంది విద్యార్ధులకు ఇప్పటి వరకు రూ.85,90,000 చెల్లించారు. కొత్తగా క్రిస్టియన్ మైనార్టీల నుంచి ఎవరు విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హత సాధించలేదు.

కాపుల్లో కాస్త నయం..

కాపు సామాజిక వర్గంలో 49మంది విద్యార్ధులను విదేశీ విద్యా దీవెన పథకంలో 2,3,4 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో భాగంగా రూ.4,84,00,000 విడుదల చేశారు. కొత్తగా మరో 8మంది విద్యార్ధులు విదేశీ విద్యాదీవెనకు అర్హత సాధించారు. వారికి మరో రూ.1,29,00,000 ముఖ్యమంత్రి బుధవారం విడుదల చేశారు. కాపు విద్యార్ధుల్లో 57మంది విద్యార్ధులకు విదేశీ విద్యా దీవెన పథకంలో అర్హత సాధించి రూ.6.13కోట్ల రుపాయల సాయాన్ని అందుకున్నారు.

ఈబీసీలకే అగ్ర తాంబులం…

ఆర్ధికంగా వెనుకబడిన ఈబీసీ సామాజిక వర్గాలలో ఇప్పటి వరకు 145మంది విద్యార్ధులు విదేశీ విద్యాదీవెన పథకానికి ఎంపికయ్యారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14,81,41,419రుపాయలు చెల్లించింది. కొత్తగా మరో 25మందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం విదేశీ విద్యా దీవెన సాయంగా రూ.5,73,48,624 ఆర్ధిక సాయం అందించారు. ఈబీసీ కోటాలో మొత్తం 170మంది విద్యార్ధులకు రూ.20,54,90,043 రుపాయలను జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో అందించారు.

2023 ఫిబ్రవరిలో ప్రారంభించిన పథకంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. ఫిబ్రవరి, జులైలో మొదటి విడత ఆర్ధిక సాయం అందుకున్న విద్యార్ధులకు వారు పూర్తి చేసిన సెమిస్టర్లు, వచ్చిన మార్కులను పరిశీలించిన తర్వాత రెండు, మూడు వాయిదాలను చెల్లిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి ఆర్ధిక సాయం అందిస్తున్నారు.

జగన్న విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా 2023 ఫిబ్రవరి మూడున 213మందికి రూ.19.95కోట్లను అందించారు. రెండో విడతలో జులై 27న 357మందికి రూ.45.53కోట్లను చెల్లించారు. బుధవారం విడుదల చేసిన మొత్తంతో కలిపి ఇప్పటి వరకు రూ.107.07కోట్లను విద్యాదీవెన పథకానికి వెచ్చించారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని 2022 జులై 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

టాప్ 50 కాలేజీల్లో ప్రవేశాలు వస్తేనే…

ప్రపంచంలో టాప్‌ 50 యూనివర్శిటీల్లో 21విభాగాల్లో అడ్మిషన్లు పొందిన వారికి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్‌లు సాధించిన కాలేజీల్లో ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

పథకానికి ఎంపికైన విద్యార్ధులకు 100శాతం ట్యూషన్ ఫీజును చెల్లిస్తారు. గరిష్టంగా కోటి పాతిక లక్షల ఫీజును ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ విద్యార్ధులకు చెల్లిస్తారు. కాపు, ఈబీసీ విద్యార్ధులకు గరిష్టంగా కోటి రుపాయలు చెల్లిస్తారు. నాలుగు విడతల్లో ప్రభుత్వ సాయం విద్యార్థులకు చెల్లిస్తారు. మొదటి విడత ఫీజును విద్యార్ధులు ఇమ్మిగ్రేషన్ అనుమతులు పొందిన తర్వాత చెల్లిస్తారు.రెండో విడతను ఫస్ట్‌ టర్మ్ లేదా సెమిస్టర్ ఫలితాలు వెలువడిన తర్వాత చెల్లిస్తారు. మూడో విడతో రెండో సెమిస్టర్ ఫలితాలు వెలువడిన తర్వాత చెల్లిస్తారు. చివరి విడత సాయాన్ని నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేసి మార్కుల జాబితాను సమర్పించిన తర్వాత విడుదల చేస్తారు.

విద్యార్ధుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. పీజీ, పిహెచ్‌డి కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబిబిఎస్‌ కోర్సుకు మాత్రమే విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింప చేస్తారు.

ఆ రెండు వర్గాలకే అధిక ప్రయోజనం...

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో లబ్ది పొందిన వారి జాబితా పరిశీలిస్తే కేవలం ఈబీసీలుగా పరిగణిస్తున్న ఓసీ సామాజిక వర్గాలకే అత్యధిక లబ్ది చేకూరింది. ఇప్పటి వరకు 170మంది ఈబీసీ విద్యార్ధులకు విదేశీ విద్యా దీవెన పథకం లబ్ది చేకూరింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో 57మంది పథకాన్ని అందుకున్నారు. కాపు, ఈబీసీ కోటాలో మొత్తం 227మంది విద్యార్ధులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్ది చేకూరింది. ఈ రెండు వర్గాలకు కలిపి ఇప్పటి వరకు రూ.26,67,90,043 చెల్లించారు.

2023 ఫిబ్రవరిలో పథకాన్ని ప్రారంభించినతర్వాత మొత్తం 164మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకం అందింది. ఈ వర్గాలన్నీ కలిపినా.. ఆర్ధికంగా వెనుకబడిన ఈబీసీ సామాజిక వర్గాలను మించి విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హత సాధించలేకపోయారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో 57మందిని కలిపితే మొత్తం 227మంది విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హత సాధించారు. “ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీ విద్యార్ధులు అందరికి కలిపి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో ఇప్పటి వరకు రూ.14,90,83,624 చెల్లించారు.”

గతానికంటే మెరుగ్గా విదేశీ విద్యా దీవెన పథకాన్ని సంతృప్తికరమైన స్థాయిలో అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా లబ్దిదారుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ విద్యార్ధులు ఈబీసీ, కాపు విద్యార్థులతో పోటీ పడి టాప్‌ 50 క్యూస్ ర్యాంకింగ్‌లు ఉన్న విదేశీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలనే నిబంధనను చాలా మంది అధిగమించలేకపోతున్నారు. పథకం ప్రారంభించిన తర్వాత ఒకే ఒక్క ఎస్టీ విద్యార్ధి పథకానికి అర్హత సాధించడమే దీనికి నిదర్శనం. 8లక్షల రుపాయల ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా గరిష్ట స్థాయిలో ఈబీసీ, ఓసీ అభ్యర్థులకు మేలు పొందినట్టు గణంకాలు వెల్లడిస్తున్నాయి.

గతం కంటే మెరుగేనా…?sar

గతంలో విదేశీ విద్యా దీవెన పథకంలో ప్రభుత్వ సాయం పరిమితంగా ఉన్నా గరిష్ట సంఖ్యలో విద్యార్థుల్ని అనుమతించే వారు. ఏటా 300మంది ఎస్సీ విద్యార్ధులు, 100మంది ఎస్టీ విద్యార్ధులు, 1000మంది బీసీ విద్యార్ధులు, 500మంది మైనార్టీ విద్యార్ధులు, 750మంది ఈబీసీ విద్యార్ధులకు విదేశీ విద్యాదీవెనకు అనుమతించే వారు.

ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు రూ.15లక్షలు, కాపు,ఈబీసీలకు రూ.15లక్షలు చెల్లించేవారు. ఇప్పుడు ఎంతమంది అర్హత సాధించినా వారికి గరిష్టంగా కోటి పాతిక లక్షల వరకు ఫీజులు చెల్లిస్తామని చెబుతున్నా అర్హత సాధించే వనరులు, పరిస్థితులు అయా వర్గాలకు లేని పరిస్థితులు వారికి శాపంగా మారాయి. అదే సమయంలో ఈబీసీ, కాపు సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున విదేశీ విద్యా దీవెన లబ్దిదారులు అర్హ‍త సాధించడం కొసమెరుపు.

తదుపరి వ్యాసం