Bapatla District : బాపట్ల జిల్లాలో దారుణం - యువతిపై అత్యాచారం, ఆపై హత్య..! డీజీపీకి సీఎం ఆదేశాలు
21 June 2024, 21:05 IST
- Bapatla District Crime News: బాపట్ల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై కొంత మంది దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు… దర్యాప్తును వేగవంతం చేసి దోషులను శిక్షించాలని డీజీపీని ఆదేశించారు.
బాపట్ల జిల్లాలో దారుణ హత్య..!
Bapatla District Crime News: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిపై అత్యాచారం చేసి, హత్య చేశారు. బహిర్బుమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై కొంత మంది దుండగులు అత్యాచారానికి పాల్పడి, హతమార్చారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. డాగ్‌స్కాడ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రసాద్, విచారణ చేపడుతున్నారు.
తెల్లవారుజామున బహిర్బుమికి సదరు యువతి ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తల్లి వెతుకుతూ వెళ్లింది. స్థానిక గర్ల్స్ హైస్కూల్ సమీపంలో కుమార్తె మృతదేహం కనపించింది. వెంటనే లబోదిబోమంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు అక్కడి చేరుకున్నారు. అక్కడ జనం గుమిగూడారు. స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలు…
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. డీజీపీ ద్వారకా తిరుమల రావును పిలుపించుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డీజీపీని ఆదేశించారు. త్వరలోనే పోలీస్ వ్యవస్థలోని ప్రక్షాళన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశించారు.
యువతి హత్య గురించి తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హత్య ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా, జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. దీంతో హోం మంత్రి వంగలపూడి అనిత ఈపూరుపాలెంకు బయలుదేరి బాధిత కుటుంబాన్ని కలుసుకున్నట్లు తెలిసింది.