HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions : పెన్ష‌న్ బ‌దిలీకి విడుద‌లైన‌ ఆప్ష‌న్‌ - అక్టోబ‌ర్ నుంచి కొత్త పెన్ష‌న్లు..!

AP Pensions : పెన్ష‌న్ బ‌దిలీకి విడుద‌లైన‌ ఆప్ష‌న్‌ - అక్టోబ‌ర్ నుంచి కొత్త పెన్ష‌న్లు..!

HT Telugu Desk HT Telugu

04 September 2024, 16:48 IST

    • రాష్ట్రంలో పెన్ష‌న్‌దారుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబ‌ర్ నుంచి కొత్త పెన్ష‌న్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధమైంది. మ‌రోవైపు పెన్ష‌న్‌ను వేరొక ప్రాంతానికి బ‌దిలీ చేసుకునేందుకు అనుకూలంగా ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఏపీలో పెన్షన్లు
ఏపీలో పెన్షన్లు

ఏపీలో పెన్షన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం వారు పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అలా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే పెన్షన్ బదిలీ అవుతుంది.

పెన్ష‌న్ బ‌దిలీ చేసుకోవాలంటే పెన్ష‌న్ బ‌దిలీ అప్లికేష‌న్ తీసుకొని, దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పూర్తి చేసిన‌ పెన్ష‌న్ బ‌దిలీ అప్లికేష‌న్‌కు పెన్ష‌న్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, బియ్యం కార్డు త‌దిత‌ర ప‌త్రాల‌ను జ‌త చేయాల్సి ఉంటుంది. అలాగే పెన్ష‌న్‌ను ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది. పెన్ష‌న్‌ను ఎందుకు బ‌దిలీ చేసుకుంటున్నావో కార‌ణాలు కూడా తెలియ‌ప‌ర‌చాలసి ఉంటుంది.

అక్టోబ‌ర్ నుంచి కొత్త పెన్ష‌న్లు..!

రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొత్త పెన్ష‌న్ల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. పెన్ష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వృద్ధ‌ాప్య, వితంతు, ఒంట‌రి మ‌హిళ‌, ట్రాన్స్‌జెండ‌ర్‌, గీత కార్మికులు, మ‌త్స్య‌కారు పెన్ష‌న్ నెల‌కు రూ.3,000 నుండి రూ.4,000ల‌కు పెరగనుంది. దివ్యాంగు పెన్ష‌న్ నెల‌కు రూ.6,000ల‌కు, పూర్తిస్థాయి దివ్యాంగుల‌కు రూ.5,000 నుండి రూ.15,000కు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారికి రూ.5,000 నుండి రూ.10,000ల‌కు పెంచారు.

ఏడాదిగా నిలిచిపోయిన కొత్త పెన్ష‌న్లు

రాష్ట్రంలో ఏడాది కొత్త పెన్ష‌న్లు మంజూరు నిలిచిపోయింది. దీంతో సుమారు మూడు ల‌క్ష‌ల మంది పెన్ష‌న్ కోసం నిరీక్షిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో న‌వ‌శ‌కం ప‌థ‌కంలో భాగంగా ఏటా జ‌న‌వ‌రి, జులై నెల‌ల్లో కొత్త పెన్ష‌న్లు మంజూరు చేస్తూ వ‌చ్చింది. 2023 జ‌న‌వ‌రికి ముందు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి జులైలో అనుమ‌తి మంజూరు చేసింది. అయితే 2023 జులై, 2024 జ‌న‌వ‌రిలో పెన్ష‌న్‌లు మంజూరు చేయ‌కుండా ద‌ర‌ఖాస్తుల‌న్నింటినీ పెండింగ్‌లో పెట్టింది.

జూన్ 4న రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. టీడీపీ కూట‌మి కూడా జులైలో కొత్త పెన్ష‌న్‌ల‌కు ఆమోదించ‌లేదు. ప్ర‌స్తుతం దాదాపు మూడు ల‌క్ష‌ల కొత్త పెన్ష‌న్ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చి మూడు నెల‌లు కావ‌స్తున్న‌ప్ప‌టికీ, కొత్తగా పెన్ష‌న్‌కు ద‌ర‌ఖాస్తుల‌ను కూడా స్వీక‌రించ‌లేదు. దివ్యాంగు, వృద్ధ‌ప్య‌, వితంతు, ఒంట‌రి మ‌హిళ‌లు కూడా పెన్ష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతున్నారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం 64,61,485 పెన్ష‌న్లు ఉన్నాయి. వాటి కోసం ప్ర‌భుత్వం ప్ర‌తి నెల రూ.2,729.87 కోట్లు ఖ‌ర్చు చేస్తుంది. ఇప్పుడు కొత్త పెన్ష‌న్ల అప్లికేష‌న్ల‌ను ఆమోదిస్తే కొత్త‌గా సుమారు మూడు ల‌క్ష‌ల పెన్ష‌న్లు పెరుగుతాయి. అంటే దాదాపు 67 ల‌క్ష‌ల పెన్ష‌న్లు అవుతాయి. ఇటీవ‌లి ఒక స‌మావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కొత్త పెన్ష‌న్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అక్టోబ‌ర్ నుంచి కొత్త పెన్ష‌న్లు అందిస్తామ‌ని వెల్ల‌డించారు. అర్హులు కొత్త‌గా పెన్ష‌న్ ఎవ‌రైనా పొందాల‌నుకునేవారు సెప్టెంబ‌ర్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో కొత్త పెన్ష‌న్ల‌కు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు అన‌ర్హుల పెన్ష‌న్‌ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు స్ప‌ష్టం చేశారు. అయితే ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం పెన్ష‌న్ బ‌దిలీ చేసుకునేందుకు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేయాల‌ని ఆదేశాలు ఇచ్చింది.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్