ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా వృద్ధాప్య పెన్షన్ పథకం ద్వారా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. 2,016 నెలనెలా అందిస్తోంది. వృద్ధాప్య పెన్షన్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, ఇతర నిబంధనలు, షరతులు ఇక్కడ తెలుసుకుందాం.
1. ఆసరా పెన్షన్ పథకం పొందాలంటే 57 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. గతంలో 65 ఏళ్ల నిబంధన ఉండేది. దీనిని సడలించారు.
2. జన్మ ధ్రువీకరణ పత్రం లేదా, ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా ఇతర ధ్రువపత్రం ద్వారా వయసు రుజువు చూపాలి.
3. పైవేవీ లేనప్పుడు అధీకృత అధికారి విభిన్న అంశాల ద్వారా వయసు అంచనా వేయగలగాలి. పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు, వారి పెళ్లిళ్లు తదితర అంశాల ద్వారా అంచనాకు రావాలి.
4. ఇలా కూడా అంచనాకు రానిపక్షంలో మెడికల్ బోర్డుకు రెఫర్ చేయాల్సి వస్తుంది.
1. మూడెకరాల వరకు తరి గానీ, ఏడున్నరెకరాల వరకు ఖుష్కి గానీ ఉండొచ్చు. అంతకు మించి ఉంటే అనర్హులు.
2. సంతానానికి ప్రభుత్వ, ప్రయివేటు, ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగం గానీ ఉంటే తల్లి లేదా తండ్రి పెన్షన్ పొందేందుకు అనర్హులు
3. పెద్ద వ్యాపారాలు (ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోలు పంపులు, రిగ్ ఓనర్లు, షాప్ ఓనర్లు) నిర్వహించేవారు, ఇదివరకే ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు, స్వతంత్ర సమరయోధుడి కేటగిరీలో పెన్షన్ పొందుతున్న వారు, కారు లేదా అంతకంటే పెద్ద వాహనాలు కలిగి ఉన్న వారు ఆసరా పెన్షన్ పొందేందుకు అనర్హులు.
4. ఆస్తిపాస్తులు, జీవనశైలి వంటివాటిని అంచనా వేసి కూడా వెరిఫికేషన్ అధికారి సదరు వ్యక్తి పెన్షన్‌కు అర్హుడా కాదా అంచనా వేస్తారు.
ఆసరా పెన్షన్‌లో పై నిబంధనల నుంచి కొందరికి మినహాయింపు ఉంది. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ప్రభుత్వం వీరికి మినహాయింపు ఇచ్చింది.
1. కొన్ని రకాల గిరిజన తెగలు
2. మహిళ కుటుంబ పెద్దగా ఉండి కుటుంబంలో ఆదాయం సమకూర్చే సభ్యులు ఎవరూ లేని సందర్భంలో అర్హత లభిస్తుంది.
3. కుటుంబ సభ్యులు దివ్యాంగులైనప్పుడు ఆసరా పథకం పొందవచ్చు.
4. దివ్యాంగులు, వితంతువు పెన్షన్లు పొందుతున్న వారు మినహా.. కుటుంబానికి ఒక్కరు మాత్రమే ఆసరా పెన్షన్ పొందేందుకు అర్హులు.
5. భూమి లేని వ్యవసాయ కూలీలు, గ్రామీణ హస్తకళల్లో (కుండలు తయారీ, చేనేతలు, కంసాలీ, వడ్రంగి) నిమగ్నమైన వారు, మురికివాడల్లో నివసించేవారు, అసంఘటిత రంగాల్లో రోజువారీ కూలీ చేసుకునే వారు(కూలీలు, రిక్షా కార్మికులు, పండ్లు, పూలు అమ్ముకునే వారు) ఆసరా పెన్షన్‌కు అర్హులు. ఇందులో పట్టణ, గ్రామీణ ప్రాంతాల తారతమ్యం లేదు.
6. ఇల్లు లేని కుటుంబాలు గుడిసెలు వంటి తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్న పక్షంలో ఆసరా పెన్షన్‌కు అర్హులవుతారు.
7. కుటుంబానికి వితంతువు గానీ, తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన వారు(57 ఏళ్లు నిండి ఉండి) గానీ యజమానిగా ఉండి ఇతర ఆదాయం, సామాజిక మద్దతు లేనిపక్షంలో వృద్ధాప్య పింఛనుకు అర్హులవుతారు.
ఫోటో, ఆధార్ కార్డు (లేనిపక్షంలో 3 నెలల్లో తీసుకోవాలి), బ్యాంకు ఖాతా, వయస్సు ధ్రువీకరణ పత్రం, వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అంగవైకల్యం కల వారు సంబంధిత ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి వద్ద గానీ, మీసేవా సెంటర్లో గానీ పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
అనంతరం మండల అభివృద్ధి అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ ఆయా దరఖాస్తులను పరీక్షిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి అర్హతలు ఉంటే పెన్షన్ సిఫారసు చేస్తూ ఆసరా వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు.
జిల్లా కలెక్టర్లు వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తారు. జిల్లా కలెక్టర్ అనుమతి మంజూరు చేశాకా ఎంపీడీవోలు ఆసరా కార్డులు జారీచేస్తారు.
సంబంధిత కథనం