Hubbali Vijayawada Express : హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ, రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం
29 September 2024, 9:17 IST
- Hubbali Vijayawada Express Chori : హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికుడి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు దొంగలు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా... మా పరిధి కాదంటూ ఇబ్బంది పెట్టారని బాధితులు వాపోతున్నారు.
హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ, రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం
Hubbali Vijayawada Express Chori : కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ చోరీ జరిగింది. రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు దొంగతనం చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రాత్రివేళ ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న తరువాత దొంగతనం జరిగింది. అయితే ఈ ఘటనపై రైల్వే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. అక్కడికి, ఇక్కడికి అని తిప్పి, తిప్పి ప్రశ్నలు వేసి, తీరా దొంగతనం తమ పరిధి కాదంటూ తిప్పించిన వైనం కనబడింది.
ఈ దొంగతనం ఘటన శనివారం హుబ్బళ్లి నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, రంగారావు సత్తెనపల్లిలో సాయిచరణ్ జ్యువెలర్స్ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ఆభరణాలను తయారు చేసి కర్ణాటకలోని బళ్లారిలో విక్రయిస్తుంటారు. అందులో భాగంగా రంగారావు, ఆయన సోదరుడు సతీష్‌బాబుతో కలిసి బంగారు ఆభరణాలను తీసుకొని మంగళవారం రాత్రి సత్తెనపల్లి నుంచి బళ్లారి వెళ్లారు.
అక్కడ మూడు రోజుల పాటు ఉండి పలు దుకాణాల వ్యాపారులను సంప్రదించారు. అయతే అక్కడ ఆభరణాల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సత్తెనపల్లి వచ్చేందుకు శుక్రవారం రాత్రి హుబ్బళ్లి-విజయవాడ రైలులో తిరుగు ప్రయాణం అయ్యారు. నంద్యాల వరకు మెలకువగా ఉన్న వీరు, తరువాత బంగారు ఆభరణాలున్న బ్యాగును రంగారావు తన తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. రైలు దొనకొండ సమీపానికి వచ్చే ముందు నిద్ర నుంచి మెలకువ వచ్చి చూసుకోగా బ్యాగు కనిపించలేదు.
దీంతో లబోదిబోమంటూ వెంటనే రైలు దిగి దొనకొండ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం ఏడుగంటల సమయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడ రైల్వేపోలీస్ స్టేషన్ లేకపోవడంతో, కొందరు మార్కాపురం వెళ్లాలని సూచించారు. దీంతో అక్కడ నుంచి మార్కాపురం వెళ్లారు. అక్కడివారు సరసరావుపేట వెళ్లాలని చెప్పడంతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్లారు. అక్కడి రైల్వే పోలీసులు సాయంత్రం వరకు రకరకాల ప్రశ్నలు అడిగి, చివరికి దొంగతనం జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీసులకు పరిధిలోకి వస్తుందని, అక్కడికి వెళ్లాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
దీంతో బాధితులు శనివారం రాత్రి నరసరావు పేట నుంచి బయలుదేరి నంద్యాల రైల్వే పోలీసుల వద్దకు వెళ్లారు. చోరీ జరిరగిందని తెలిసినా, దొంగలను పట్టుకునేందుకు వెంటనే స్పందించకపోగా, కనీసం కేసు నమోదు చేయకుండా రైల్వే పోలీసులు పరిధి పేరుతో నిర్లక్ష్యం ప్రదర్శించారని బాధితులు వాపోతున్నారు. ఇటీవలి రైల్వే దొంగతనాలు పెరిగాయి. ఈ రెండు మూడు నెలల్లోనే నాలుగైదు భారీ దొంగతనాలు జరిగాయి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు