తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mumbai Actress Case : ముంబయి నటి జెత్వానీ కేసు, వైసీపీ నేత అరెస్టు- నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు

Mumbai Actress Case : ముంబయి నటి జెత్వానీ కేసు, వైసీపీ నేత అరెస్టు- నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు

23 September 2024, 16:08 IST

google News
    • Mumbai Actress Case : ముంబయి నటి కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో ముగ్గురు ఐపీఎస్ లతో పాటు మరో ఇద్దరు పోలీసులను నిందితులుగా చేర్చారు. నటి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేశారని వీరిపై అభియోగాలు ఉన్నాయి.
ముంబయి నటి జెత్వానీ కేసు, వైసీపీ నేత అరెస్టు- నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు
ముంబయి నటి జెత్వానీ కేసు, వైసీపీ నేత అరెస్టు- నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు

ముంబయి నటి జెత్వానీ కేసు, వైసీపీ నేత అరెస్టు- నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు

Mumbai Actress Case : ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు అతడిని వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా కుక్కల విద్యాసాగర్‌ ను పోలీసులు చేర్చారు. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. ఈ కేసులో నిందితులుగా పలువురు ఐపీఎస్‌ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఏ2గా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్‌ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను చేర్చారు. ముంబయి నటిని వేధించిన కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ లు, ఏసీపీ, సీఐను సస్పెండ్ చేసింది.

వైసీపీ నేత విద్యాసాగర్‌తో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ కుమ్మక్కై పథకం ప్రకారం ముంబయి నటి జెత్వానీ వేధించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నటి జెత్వానీని అక్రమంగా చేసి, విజయవాడకు తరలించారని బెయిల్ దొరక్కుండా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు డెహ్రాడూన్‌ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలులో అర్ధరాత్రి విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించారు. విద్యాసాగర్ ను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.

నాలుగు సార్లు ఫిర్యాదులు

తప్పుడు కేసు నమోదు చేసి తనను వేధించినట్లు ముంబయి నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో సెప్టెంబర్ 13న కేసు నమోదు చేసిన పోలీసు.. దర్యాప్తు చేపట్టారు. కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసుల పేర్లు నటి జెత్వానీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను తాజాగా అరెస్టు చేశారు.

కాదంబరి జెత్వానీ మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్‌ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించగా..తాజాగా అతడు డెహ్రాడూన్ లో పట్టుబడ్డాడు.

తదుపరి వ్యాసం