TDP vs Janasena : అధికారం చెలాయిస్తామంటే కుదరదు.. చింతమనేని మాస్ వార్నింగ్!
01 November 2024, 14:04 IST
- TDP vs Janasena : దెందులూరు నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ వార్ ముదురుతోంది. తాజాగా పైడిచింతలపాడు గ్రామంలో టీడీపీ, జనసేన వర్గాలు ఘర్షణపడ్డాయి. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఇష్యూపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ వార్నింగ్ ఇచ్చారు.
చింతమనేని మాస్ వార్నింగ్
ఏలూరు జిల్లాలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య వరుస ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో ఆధిపత్య పోరు సాగుతోంది. ఇటీవల వైసీపీ నుంచి జనసేన లోకి వచ్చిన వారి కారణంగా గొడవలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఘర్షణలో గాయపడ్డవారిని చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరాయి. పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారు. చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిది. పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటి. గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలి. ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది వీళ్లే. ఇప్పుడుపార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదు. దీనిపై జనసేన అధినాయకత్వంతో మాట్లాడుతాం' అని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.
దెందులూరు నియోజకవర్గం పైడిచింతలపాడు గ్రామంలో పింఛన్ల పంపిణీ విషయంలో ఘర్షణ తలెత్తింది. దీపావళి పండగ రోజు తామే పింఛన్లు పంపిణీ చేస్తామని ఇరు పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. దీంతో వివాదం తలెత్తింది. ఇరు పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. వారిలో ఓ పార్టీ వారు ఏలూరులో చికిత్స పొందుతుంటే.. మరో పార్టీ బాధితులు విజయవాడలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై దెందులూరు జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ ఇవాళ పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ శ్రేణుల దాడులపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతనెలలో కూడా ఇక్కడే పింఛన్ల పంపిణీలో గొడవ జరిగింది. ఈ ఇష్యూ జిల్లా అధికారుల వరకు వెళ్లింది. ఇలాంటి గొడవలపై పోలీసులు కూడా చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.
ఎందుకీ గొడవలు..
2024 అసెంబ్లీ ఎన్నికల వరకు వైసీపీలో కొనసాగిన కొందరు నాయకులు ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఏలూరు రూరల్ మండలం, పేదవేది, దెందులూరు మండలాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేసిన జనసేనలో చేరారు. వీరి చేరికను జనసేన ఆహ్వానించిన టీడీపీ మాత్రం వ్యతిరేకించింది. అయితే.. జనసేనలో చేరిన తర్వాత.. వారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.
మొన్నటి వరకు అధికారం చలాయించిన వారే ఇప్పుడు మళ్లీ పెత్తనం చేయడం ఏంటని టీడీపీ కేడర్ ప్రశ్నిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారే.. ఇప్పుడు వారే కార్యక్రమాలు నిర్వహిస్తే.. ఇక ప్రభుత్వం మారి ప్రయోజనం ఏంటనే వాదన వినిపిస్తోంది. దీనిపై టీడీపీ గట్టి నిర్ణయం తీసుకోకపోతే.. పార్టీకి నష్టం తప్పదని ద్వితీయ శ్రేణి నాయకులు హెచ్చరిస్తున్నారు. అటు జనసేన కేడర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తోంది.