Kadapa Petrol Attack : కడప జిల్లాలో దారుణం, ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఉన్మాది
19 October 2024, 17:09 IST
Kadapa Petrol Attack : ఏపీలో మరో దారుణం జరిగింది. కడప జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ తో దాడి చేసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థినిని కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కడప జిల్లాలో దారుణం, ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిపై విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఇంటర్ విద్యార్థినిపై విగ్నేష్ పెట్రోల్ తో దాడి కలకలం రేపింది. విద్యార్థినిని బలవంతంగా రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటలు వ్యాపించి, విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. స్థానికులు యువతిని గుర్తించి కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై బద్వేలు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు విగ్నేష్‌ను అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఆయన ఘటనాస్థలిని పరిశీలించనున్నారు.
విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా
కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. గోపవరం మండలంలో ఈ ఘటన జరిగిందని, విద్యార్థినిని కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. ఘటనాస్థలిని పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు బయలుదేరారని సమాచారం.
ఇంటర్ విద్యార్థినికి పురుగుల మందు పట్టించి హత్య
కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యకు పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. ఆ విద్యార్థిని ఇంట్లోకి చొరబడి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని వచ్చేసరికి విద్యార్థిని అపస్మారక స్థితిలో పడింది. బాలికను హుటాహుటినా ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో ఒక్కగానికి ఒక్క కుమార్తె పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థినిని ఆ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సన్నీ ప్రేమ పేరుతో వేధించారు. సన్నీ ప్రేమను ఆమె నిరాకరించింది. తాను ప్రేమించలేనని, చదువుకోవాలని స్పష్టం చేసింది. దీంతో కోపంతో రగిలిపోతున్న సన్నీ అదును చూసి విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు వెళ్లడం తెలుసుకుని.,, ఇంట్లో విద్యార్థిని ఒంటరిగా ఉందని నిర్థారించుకున్నాడు. సన్నీ ఆమె ఇంట్లోకి ప్రవేశించి తనను ప్రేమించాలని, ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో బెదిరించాడు.
అప్పటికీ బాలిక ఆ ప్రేమోన్మాది మాట లెక్కచేయకపోవడంతో ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావు బతుకుల్లో అపస్మారక స్థితిలో పడిఉంది. కొద్దిగా తెలివి ఉండటంతో బాలిక తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పింది. తనకు సన్నీ అనే వాడు బలవంతంగా పురుగు మందు తాగించాడని చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు విద్యార్థిని అదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా...అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.