New districts in AP | రాష్ట్రంలో 26 జిల్లాలు.. 'ఎన్టీఆర్'గా విజయవాడ
26 January 2022, 19:58 IST
- AP new districts | అంధ్రప్రదేశ్లో ఇకపై 26 జిల్లాలు ఉండనున్నాయి. సంబంధిత ప్రతిపాదనతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం
AP districts notification | ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ.. సంబంధిత ప్రతిపాదనతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ను బుధవారం జారీ చేసింది. ఎవైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల్లోగా ప్రభుత్వానికి చెప్పాలని స్పష్టం చేసింది.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని జిల్లాలు, వాటి ప్రధాన కార్యాలయాలు ఇవే..
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం(పార్వతీపూరం), అల్లూరి సీతారామ రాజు(పాడేరు), విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ(అమలాపురం), తూర్పు గోదావరి(రాజమహేంద్రవరం), పశ్చిమ గోదావరి(భీమవరం), ఏలూరు, కృష్ణ(మచిలీపట్నం), ఎన్టీఆర్(విజయవాడ), గుంటూరు, బాపట్ల, పల్నాడు(నర్సారావుపేట), ప్రకాశం(ఓంగోలు), ఎస్పీఎస్ నెల్లూరు(నెల్లూరు), కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి(పుట్టపర్తి), వైఎస్ఆర్ కడప(కడప), అన్నమయ్య(రాయచోటి), శ్రీ బాలాజీ(తిరుపతి), చిట్టూరు.
పునర్వ్యవస్థీకరణ అనంతరం జనాభా పరంగా కర్నూల్(23.66 లక్షలు) అగ్రస్థానంలో నిలవనుంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా(9.54లక్షలు)లో అత్యల జనాభ నమోదుకానుంది.
ఉగాది నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
టీడీపీ విమర్శలు..
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ- టీడీపీ మధ్య రాజకీయ శతృత్వం కొనసాగుతోంది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాలనా సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు.. జిల్లాల సంఖ్యను పెంచుతామని 2019 ఎన్నికల సమయంలోనే హామీనిచ్చారు జగన్. ఆ సమయంలో.. ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో పర్యటించిన ఆయన.. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు.
జిల్లాల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ విమర్శలు సంధించింది.
"ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు జగన్కు మూడేళ్ల సమయం పట్టింది. అది కూడా ఎన్టీఆర్పై ప్రేమతో చేయలేదు. ప్రజల్లో తనపై నమ్మకం తగ్గుతోందని గ్రహించే జగన్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదిఏమేనా, ఎంత ఆలస్యమైనా, మొత్తానికి విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషకరం," అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు.