Republic Day| ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: ఏపీ గవర్నర్ ప్రసంగం
26 January 2022, 13:07 IST
ఆంధ్రప్రదేశ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. నవరత్నాల ద్వారా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను అందుతున్నాయని, ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తున్నామని అన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిర గాంధీ మైదానంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతుకుముందు పోలీసు దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శన జరిగింది. మొత్తం 15 శాఖలకు చెందిన శకాటలను ఇక్కడ ప్రదర్శించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్‌తో పాటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషేన్ రాజు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా కారణంగా సందర్శకులకు అనుమతినివ్వలేదు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభకాంక్షలు తెలిపారు. నవరత్నాల ద్వారా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను అందుతున్నాయని, ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తున్నామని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.19.126 కోట్లు సాయం అందించినట్లు వివరించారు. రూ.3177 కోట్ల వ్యయంతో నాలుగు ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచామని ఆయన తెలిపారు.
విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని, రూ.34 వేల కోట్లతో మనబడి నాడు-నేడు కింద పాఠశాలల, కళాశాలలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అమ్మఒడి, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద లాంటి పథకాల ద్వారా విద్యార్థులకు లబ్దిచేకురుతోందని గవర్నర్ వెల్లడించారు.
ఉద్యోగులకు ప్రభుత్వం అండవేళలా ఉంటుందని గవర్నర్ అన్నారు. 11వ పీఆర్సీలో భాగంగా 23 శాతం ఫిట్‌మెట్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు కూడా 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. ఉగాది నాటికి 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని స్పష్టం చేశారు.