CBN Supreme Court: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీంలో చంద్రబాబుకు ఊరట
29 January 2024, 13:07 IST
- CBN Supreme Court: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడుకు ఊరట
CBN Supreme Court: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీహైకోర్టు నవంబర్ 24న మంజూరు చేసిన ఉత్తర్వులను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది.విచారణకు చంద్రబాబు సహకరించపోతే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితుడిగా చేర్చారు. చంద్రబాబుపై దాఖలైన పలు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
నవంబర్ 24వ తేదీన ఇన్నర్ రింగ్ రోడ్డు ( Inner ring road ), టీడీపీ హయంలో ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పాక్షిక హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
ఏపీ సిఐడి నమోదు చేసిన Inner ring road కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం చూపదని అభిప్రాయపడింది. హైకోర్టు మంజూరు చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది.
ఏమి జరిగిందంటే…
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సెప్టెంబర్ 12న సిఐడి పిటిషన్ దాఖలు చేసింది.
ఆ సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌తోపాటు వారి బినామీలైన లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజినీ కుమార్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసులో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్ చేయడానికి సీఐడీ ప్రయత్నించింది. అప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి పీటీ వారంట్ దాఖలు చేసింది.
న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లుగా పరిగణించే వారు. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సిట్ ఆరోపిస్తోంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారని సిఐడి ఆరోపించింది.
బినామీ లావాదేవీలతో లింగమనేని రమేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మెలికలు తిప్పి సింగపూర్ కన్సల్టెన్సీ రూపొందించినట్లు మభ్యపుచ్చారని సిట్ ఆరోపిస్తోంది. రూ.177.50 కోట్లుగా ఉన్న తమ 148 ఎకరాల మార్కెట్ విలువను అమాంతం రూ.877.50 కోట్లకు పెంచుకున్నారని అమరావతి రాజదాని నిర్మాణం పూర్తయితే ఆ భూముల మార్కెట్ విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు పెరిగేలా పథక రచన చేశారని సిట్ ఆరోపించింది.
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములు ఉన్నాయని, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కుంభకోణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా చంద్రబాబు వాటా కల్పించారని చెబుతున్నారు. రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉందని లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను కొనుగోలు చేసినట్లు చూపించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ-1)గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ-3గా, లింగమనేని రాజశేఖర్ ఏ-4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్‌ను ఏ-5గా పేర్కొంది.
సీఆర్‌డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ రూపొందించారు. మొదటి అలైన్‌మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది.
చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి నిర్మించాల్సి వస్తుంది. దాంతో తమ భూముల విలువ అమాంతం పెరగదనే ఉద్దేశంతో సీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని సిఐడి ఆరోపించింది.