తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur Accident : అనంత‌పురంలో రోడ్డు ప్ర‌మాదం.. భార్య భ‌ర్త‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి

Anantapur Accident : అనంత‌పురంలో రోడ్డు ప్ర‌మాదం.. భార్య భ‌ర్త‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి

HT Telugu Desk HT Telugu

24 September 2024, 9:13 IST

google News
    • Anantapur Accident : అనంత‌పురం జిల్లాలో రోడ్డు జరిగింది. కూతుళ్లు, మ‌న‌వ‌ళ్లు సంతోషంగా గ‌డిపి తిరిగి ఇంటికి వెళ్తున్న భార్య భ‌ర్త‌లు.. ఇంటికి చేర‌కుండానే అనంత‌లోకానికి చేరారు. స‌మాచారం తెలుసుకున్న‌ కుటుంబ స‌భ్యులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని రోదించారు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దంపతులు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దంపతులు

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దంపతులు

అనంత‌పురం న‌గ‌ర శివారులోని నేష‌న‌ల్ పార్కు వ‌ద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జ‌రిగింది. అనంత‌పురం నుంచి స్వ‌గ్రామమైన గుత్తి మండ‌లం అబ్బేదొడ్డికి ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్లున్న దంప‌తులు.. రోడ్డు ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ట‌మాట లోడుతో ముంబాయి వెళ్తున్న‌ ఐష‌ర్ వాహ‌నం.. నేష‌న‌ల్ పార్క్ వ‌ద్ద‌ దంప‌తులు ప్ర‌యాణిస్తున్న దిచ‌క్ర‌వాహ‌నంపై ప‌డింది. దీంతో వారు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

అనంత‌పురం జిల్లా గుత్తి మండ‌ల ప‌రిధిలోని అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన క‌మ‌తం హనుమంత రెడ్డి (70), క‌మతం రంగ‌మ్మ (65) దంప‌తులకు ముగ్గురు కుమార్తెలు జ‌య‌ల‌క్ష్మి, కాంత‌మ్మ‌, కృష్ణ‌కుమారి, ఒక కుమారుడు నాగేశ్వ‌ర రెడ్డి ఉన్నారు. అంద‌రికి పెళ్లిళ్లు అయిపోయాయి. నాగేశ్వ‌ర రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అనంత‌పురంలో చిన్మ‌య‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న కుమార్తెల‌ను చూసేందుకు ప్ర‌తివారం హ‌నుమంత రెడ్డి, రంగ‌మ్మ వెళ్లి వ‌చ్చేవారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం వారి కుమార్తెల‌ను చూడ‌డానికి అనంత‌పురంలో చిన్మ‌య‌న‌గ‌ర్‌ వెళ్లారు. కుమార్తెలు, మ‌న‌వ‌ళ్ల‌తో సంతోషంగా గ‌డిపి తిరిగి సోమ‌వారం ద్విచ‌క్ర వాహ‌నంపై స్వ‌గ్రామానికి బ‌య‌లుదేరారు.

న‌గ‌రంలోని నేష‌న‌ల్ పార్క్ వ‌ద్ద 44 జాతీయ ర‌హ‌దారిపై వెళ్తుండ‌గా.. ప‌క్క‌నే అనంత‌పురం క‌క్క‌ల‌ప‌ల్లి మండిలో టమోట బాక్సులు లోడు చేసుకుని ముంబయి (నాగ‌ర్ కోయిల్‌)కు వెళ్తున్న ఐష‌ర్ వాహ‌నం స్పీడ్ బ్రేక‌ర్ల వ‌ద్ద అదుపుత‌ప్పింది. ఐష‌ర్ వాహ‌నం ద్విచక్ర‌వాహ‌నంపై బోల్తా ప‌డింది. వాహ‌నంలో ఉన్న బ‌రువైన టమోటా ట్రేలు మీద ప‌డ‌డంతో.. భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ తీవ్ర గాయాల‌తో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచారు. ప్ర‌మాద ధాటికి హ‌నుమంత రెడ్డి త‌ల తెగిప‌డిపోయింది.

స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. స్థానికుల స‌హాయంతో క్రేన్ ద్వారా ఐష‌ర్ వాహ‌నాన్ని ప‌క్క‌కు తొలిగించారు. మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం అనంత‌పురం స‌ర్వ‌జ‌న ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో.. వారు ఆసుప‌త్రికి చేరుకున్నారు. త‌మతో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తార‌ని అనుకున్న త‌ల్లిదండ్రులు ఇలా అనంత‌లోకానికి చేరుతార‌నుకోలేద‌ని కుమార్తెలు గుండెల‌విసేలా రోదించారు. అబ్బేదొడ్డి గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

ఉద్యోగ విర‌మ‌ణతో విహారానికి వెళ్లి..

ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌డంతో ఇక‌నైనా సంతోషంగా జీవితాన్ని గ‌డ‌పాల‌ని విహారయ‌త్ర‌కు వెళ్లిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు.. అనంత‌లోకానికి చేరారు. అనంత‌పురంలోని శార‌దాన‌గ‌ర్‌లో నివాస‌ముంటున్న విశ్రాంతి ఉపాధ్యాయుడు న‌ర‌సింహారెడ్డి (62) నార్ప‌ల మండ‌లం బి. బండ్ల‌ప‌ల్లి జెడ్పీ హైస్కూల్‌లో సోష‌ల్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తూ ఆగ‌స్టు 31న ఉద్యోగ విర‌మ‌ణ పొందారు. ఈ క్ర‌మంలో ప‌ది మంది స్నేహితుల‌తో క‌లసి మూడు రోజుల క్రితం రెండు వాహ‌నాల్లో గోవా యాత్ర‌కు వెళ్లారు. క‌ర్ణాట‌క‌లోని హోస్పేట స‌మీపంలో ఓ వాహ‌నం అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న న‌ర‌సింహారెడ్డి ఛాతికి బ‌ల‌మైన గాయం అయింది. క్ష‌త‌గాత్రుల‌ను హోస్పేట‌లోని ఓ ఆసుప‌త్రిలో చేర్పించారు. సోమ‌వారం మెరుగైన చికిత్స కోసం అనంత‌పురంలోని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలోని విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. భార్య‌, బిడ్డ‌లు క‌న్నీరు మున్నీరు అయ్యారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం