Family member certificate: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు ఎలా?
21 September 2022, 12:33 IST
- Family member certificate: కుటుంబ యజమాని మరణించినప్పుడు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఒక రకంగా వారసత్వ ధ్రువీకరణగా పరిగణిస్తారు. కుటుంబ యజమానికి సంబంధించిన స్థలాలు, ఆస్తుల బదలాాయింపు, ఇతర అవసరాల నిమిత్తం ఈ సర్టిఫికెట్ అవసరం.
కుటుంబం (ప్రతీకాత్మక చిత్రం)
Family member certificate: కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబ సభ్యులు షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కుటుంబ పెద్దకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలు కొనసాగించేందుకు, ప్రభుత్వ సాయం పొందేందుకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్, బీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు, గ్రాట్యుటీ వంటి సౌలభ్యం ఉన్న వారికి కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అవసరం.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను మండల రెవెన్యూ అధికారి జారీ చేస్తారు. అయితే ఈ సర్టిఫికెట్ కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Family member certificate: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం అవసరమైన ధ్రువపత్రాలు
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
మీ సేవా సెంటర్లో మీ వివరాలు సమర్పిస్తే దరఖాస్తు ఫారాన్ని నింపుతారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే మీ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన నోటరీ కూడా చేయించి మీ సేవా కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
మీ సేవలో దరఖాస్తు ఫారం నింపాక, సంబంధిత పత్రాలతో కూడిన దరఖాస్తును మండల రెవెన్యూ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు వివరాలను మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ నిర్ధారించుకుని పత్రం జారీ చేసేందుకు ఎమ్మార్వోకు సిఫారసు చేస్తారు.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సాధారణంగా రెండు మూడు వారాల్లో జారీ చేస్తారు. గరిష్టంగా నాలుగు వారాలు పడుతుంది.