Single Women Pension | ఒంటరి మహిళ పెన్షన్‌కు ఎవరు అర్హులు? దరఖాస్తు ఎలా?
24 January 2022, 20:25 IST
- Single Women Pension.. ఒంటరి మహిళకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సింగిల్ వుమెన్ పెన్షన్ అందిస్తోంది. నెలకు రూ. 2,016 ల చొప్పున అందించే ఈ సాయం పొందేందుకు అర్హులు ఎవరు? నిబంధనలేంటి? దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఒంటరి మహిళ (ప్రతికాత్మక చిత్రం)
సింగిల్ వుమెన్ (ఒంటరి మహిళ) కు నెలకు రూ. 2,016 ల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది.
సింగిల్ వుమెన్ పెన్షన్‌కు అర్హులు
వివాహిత: 18 ఏళ్ల వయస్సు ఉండి వివాహమయ్యాక భర్త నుంచి విడిపోయి వేరుగా ఉన్న వారు, భర్త వదిలేసిన వారు (ఏడాది కాలానికి పైగా )
అవివాహిత: వివాహం చేసుకోని మహిళలు గ్రామీణులైతే 30 ఏళ్లు నిండి ఉండాలి. పట్టణ వాసులైతే 35 ఏళ్లు నిండి ఉండాలి.
కుటుంబ వార్షికాదాయం గ్రామీణులైతే రూ. 1,50,000 మించరాదు. పట్టణవాసులైతే రూ. 2 లక్షలకు మించరాదు.
లబ్ధిదారులు ప్రభుత్వ ఇతర పథకాల ద్వారా పెన్షన్ పొందరాదు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ద్వారా పెన్షన్ అందుకునే వారు అనర్హులు.
57 ఏళ్ల వయస్సు నిండితే వృద్ధాప్య పింఛన్‌కు అర్హులవుతారు.
ఒకవేళ సదరు మహిళ వివాహం చేసుకున్నా, శాశ్వత ఉద్యోగం సంపాదించుకున్నా ఈ ఒంటరి మహిళ పెన్షన్ నిలిచిపోతుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీ కార్యదర్శి, పట్టణ స్థానిక సంస్థ అయితే బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలు సదరు అధికారుల వద్ద నుంచి గానీ, మీ సేవా సెంటర్ ద్వారా గానీ పొందవచ్చు.
దరఖాస్తు ఫారానికి ఫోటో, వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు గానీ ఓటరు గుర్తింపు కార్డు గానీ, బర్త్ సర్టిఫికెట్ గానీ, పాఠశాల నుంచి టీసీ గానీ జత చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతా పాస్ బుక్ గానీ, పోస్టాఫీస్ ఖాతా పాస్ బుక్ గానీ జత చేయాలి.
అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డు గానీ ఇన్‌కమ్ సర్టిఫికెట్ (ఆధాయ ధ్రువీకరణ పత్రం) గానీ జత చేయాలి.
అర్హులైన లబ్ధిదారులను గ్రామ సభ లేదా వార్డు సభ ద్వారా నిర్ణయిస్తారు. ఆయా దరఖాస్తులను మండల రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ కమిషనర్ పరీక్షిస్తారు.
పెన్షన్ సిఫారసు చేస్తూ తహశీల్దారు లేదా మున్సిపల్ కమిషనర్ లేదా జీహెచ్ఎంసీ అయితే డిప్యూటీ కమిషనర్ ఆసరా వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు.
వీటిని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లేదా జిల్లా రెవెన్యూ అధికారి ఆయా దరఖాస్తులను కలెక్టర్ పరిశీలనకు పంపి ఆమోదం పొందుతారు.