Gudivada YCP vs TDP : రాజకీయ సన్యాసం చేసి మాట నిలబెట్టుకోవాలి...! కొడాలి నాని ఇంటి వద్ద ఆందోళన
07 June 2024, 18:25 IST
- Tension at Kodali Nani House : మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని… మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత శ్రేణులు డిమాండ్ కు దిగాయి.
కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత
Tension at Kodali Nani House : కృష్ణా జిల్లా గుడివాడలోని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని.... మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు.
కొడాలి నాని ఇంటి వద్దకు చేరిన తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా తమ వెంట తెచ్చుకున్న కోడి గుడ్లను నాని ఇంటిపైకి విసిరారు. జై చంద్రబాబు అంటూ కోడాలి నాని ఇంటి వద్ద టపాసులను కూడా కాల్చారు. ఓ దశలో నాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మాట నిలబెట్టుకోవాలి - పొట్లూరి దర్శిత్
ఈ సందర్భంగా తెలుగు యువత నాయకుడు పొట్లూరి దర్శిత్ మాట్లాడుతూ… గుడివాడలో కొడాలి నానికు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని హెచ్చరించారు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని కొడాలి నాని ఛాలెంజ్ చేశారని గుర్తు చేశారు. చెప్పిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
వంశీ ఇంటి వద్ద ఆందోళన….
మరోవైపు వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద టీడీపీ నేతల ఆందోళన చేపట్టారు. దీంతో విజయవాడ గాయత్రి నగర్ లో ఉన్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కారుపైకి ఎక్కిన పలువురు… వంశీ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉండగా తమపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల రంగ ప్రవేశం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.
వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి....ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు.
ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలని అన్నారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.