Eluru District : ఏలూరులో ఘోరం...! భర్తకు మద్యం తాగించి భార్యపై సామూహిక అత్యాచారం
18 August 2024, 8:00 IST
- ఏలూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో భర్తపై దాడి చేసిన ముగ్గురు యువకులు… అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
ఏలూరు జిల్లాలో ఘోరం representative image
ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. భర్తతో కలిసి మద్యం తాగిన ముగ్గురు యువకులు…. మద్యం మత్తులో ఆయనపై దాడి చేశారు. ఆపై అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డురు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది.
ఏలూరు జిల్లా పెదవేగి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏలూరు నగరంలో వన్‌టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు. 15 రోజుల క్రితమే ఏలూరు వచ్చిన వీరు పగలు హోటల్లో పని చేస్తుంటారు. అద్దె ఇల్లు దొరకకపోవడంతో రాత్రిళ్లు రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీ అరుగులపై నిద్రిస్తుంటారు. అద్దె ఇల్లు దొరికేవరకు అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అద్దె ఇల్లు దొరికితే వెళదామని అనుకుంటున్నారు. అయితే వీరికి ఏలూరు నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు.
ఆ ముగ్గురు యువకులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటారు. అయితే వీరు బాగా దగ్గర అయ్యారు. స్నేహితులుగా మారారు. దీంతో శుక్రవారం అర్థరాత్రి ఆ వ్యక్తి, ముగ్గురు యువకులు కలిసి రామకోటిలో వీరు ఆశ్రయం పొందుతున్న ప్రాంతంలోనే మద్యం సేవించారు. మద్యం మత్తులో భర్తపై దాడి చేశారు. ఆయన భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
ఆమె వద్దని ఎంత వారించినప్పటికీ ఆ ముగ్గురు వినలేదు. ఏం చేయాలో తెలియక కేకలు వేసింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమె కేకలకు స్పందన రాలేదు. ఎంత ప్రతిఘటించిన ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ముఖంపై దాడి చేశారు.
తన భార్యను అత్యాచారం చేసిన వారిని అడ్డుకోలేని పరిస్థితుల్లో భర్త కూడా కేకలు వేశాడు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో సాయం దొరకలేదు. కేకలు వేస్తూ పక్కనే ఉన్న రోడ్డు మీదకు వచ్చాడు. కొద్దిసేపటి తరువాత అటుగా వెళ్తున్న యువకుడికి జరిగిన విషయం చెప్పి… తన భార్యను రక్షించాలని కోరాడు.
ఆ యువకుడు స్పందించి ఘటనా స్థలానికి వెళ్లిసరికే, ఆ ముగ్గురు అక్కడ్నుంచి పరారయ్యారు. 100కు కాల్ చేయటంతో పాటు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కూడా ఫిర్యాదు చేశారు. నిందితులు ముగ్గురిని శనివారం ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు నగరంలోని లంబాడీ పేటకు చెందిన నారపాటి నాగేంద్ర, చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్‌కుమార్ (నాని)లను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు వీరికి 14 రోజులపాటు రిమాండ్‌ను విధించింది.