Fake Notes Racket: ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల ముఠా దందా గుట్టురట్టు, రూ.47లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
Fake Notes Racket: ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల ముఠా దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. రూ.47 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
Fake Notes Racket: ఏలూరు జిల్లాలో నకిలీ నోట్ల ముఠా దందా జరుగుతోంది. అయితే ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ నోట్లను దందా చేసే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ.47 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లాయిగూడేనికి చెందిన మారుమూడి మధుసూదనరావు, గప్పలవారి గూడేనికి చెందిన కారు డ్రైవర్ బిరెల్లి రాంబాబు ఇద్దరూ కలిసి 108 అంబులెన్స్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న దొండపాటి ఫణికుమార్‌కు జులై 28న ఫోన్ చేశారు. తమ వద్ద రూ.44 లక్షలు నకిలీ నోట్లు ఉన్నాయని, అసలు కరెన్సీ రూ.10 లక్షలు ఇస్తే ఆ రూ.44 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పారు. అందుకు ఫణికుమార్ అంగీకరించాడు. వీరి మధ్య ఒప్పందం కూడా కుదిరింది.
అయితే ఫణికుమార్ తన వద్ద ప్రస్తుతం రూ.3 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. దీంతో ఆ మూడు లక్షల రూపాయాలు జులై 30 అడ్వాన్సుగా మధుసూదనరావు, రాంబాబు తీసుకున్నారు. అయితే ఫణికుమార్ ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నాడు. దీనికి స్నేహితులు ఇలాంటి నమ్మొద్దని, ఇలాంటివి నమ్మి చాలా మంది మోసపోయారని తెలిపారు. నువ్వు ఆలోచించుకోవాలని సూచించారు. దీంతో ఫణికుమార్ ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
అయితే పోలీసులు ఫణికుమార్‌కు కొన్ని సూచనలు చేశారు. అలా అయితే ఆ ముఠాను సులువుగా పట్టుకొవచ్చని తెలిపారు. పోలీసుల సూచన మేరకు మిగిలిన ఏడు లక్షల రూపాయాలు ఆగస్టు 3 (శనివారం) తీసుకొస్తానని మధుసూదనరావు, రాంబాబులకు ఫోన్ చేసి ఫణికుమార్ చెప్పాడు. ఏలూరులోని కొత్త బస్టాండ్ వెనుక రైల్వేలైన్ వద్దకు ఏడు లక్షల రూపాయాలను తేవాలని ఫణికుమార్‌కు మధుసూదనరావు, రాంబాబు సూచించారు.
దీంతో సీసీఎస్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ, త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు తమ పోలీసు సిబ్బందితో అక్కడ కాపు కాశారు. అక్కడ మధుసూదనరావు, రాంబాబుల కోసం ఫణికుమార్ ఎదురు చూస్తున్నారు. నగదు మార్చుకునేందుకు వారిద్దరూ అక్కడి వచ్చారు. వెంటనే పోలీసులు వారిపై దాడి చేసి, మధుసూదనరావు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 94 నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని జిల్లా పోలీపు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ వద్దకు తీసుకెళ్లారు. వారిని ఎస్పీ మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అయితే వీరిద్దరూ పాత నేరస్థులేనని, వారిపై కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించి విజయవంతం చేసిన సీసీఎస్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ, త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావులతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)