Dwaraka Tirumala : అక్టోబర్ 13 నుంచి 20 వరకు ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి తిరుకల్యాణ ఉత్సవాలు
29 September 2024, 16:54 IST
- Dwaraka Tirumala : అక్టోబర్ 13 నుంచి 20 వరకు ద్వారకా తిరుమలలలో.. వెంకటేశ్వరస్వామి ఆశ్వయుజమాస దివ్య తిరుకల్యాణ ఉత్సవాలు జరగనున్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో భక్తులు భారీగా వస్తారని ఈవో ఎన్‌విఎస్ఎన్ మూర్తి తెలిపారు.
ద్వారకా తిరుమల
పశ్చిమ గోదావరి జిల్లాలో చిన తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల.. చాలా విశిష్ట, పవిత్రమైన చారిత్రక పుణ్యక్షేత్రం. భక్తుల తాకిడి నిరంతరం ఉంటుంది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కాలిన పదుల కిలో మీటర్లు నడిచి స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజులు చేస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో అక్టోబర్ 13 నుంచి 20 వరకు వెంకటేశ్వరస్వామి ఆశ్వయుజ మాస తిరుకల్యాణ ఉత్సవాలు జరుగుతాయి.
వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో.. శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలు జరుతారు. ఆశ్వయుజ మాస తిరుకల్యాణ ఉత్సవాలను పురస్కరించుకుని.. ఆయా రోజుల్లో ఆలయంలో స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు ఉండవు. అక్టోబర్ 17న తిరుకల్యాణం, అక్టోబర్ 18న రథోత్సవం జరుగుతోంది.
అక్టోబర్ 13న స్వామివారిని పెండ్లి కుమారుడు, అమ్మవారిని పెండ్లి కుమార్తెలుగా తయారు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు గజ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం ఉంటుంది. అక్టోబర్ 14న ధ్వజారోహణ చేస్తారు. అదే రాత్రి తొమ్మిది గంటలకు హంస వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. 16న ఉదయం ఏడు గంటలకు సూర్య ప్రభ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి ఏడు గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతోంది.
అక్టోబర్ 17న రాత్రి ఎనిమిది గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అక్టోబర్ 18న రాత్రి ఏడు గంటలకు రథోత్సవం, అక్టోబర్ 19 ఉదయం ఏడు గంటలకు చక్రస్నానం, రాత్రి ఏడు గంటలకు శ్రీవారి ధ్వజా అవరోహణ, అక్టోబర్ 20న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ, శ్రీపుష్పయాగంంతో ఉత్సవాలు ముగుస్తాయి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)