Amaravathi Drone Summitt 2024 : ఈనెల 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’ - 5 వేల డ్రోన్లతో భారీ షో
18 October 2024, 16:12 IST
- Amaravathi drone Summitt 2024 : ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి డ్రోన్ పండగకు సిద్ధమైంది. ఈనెల 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’ కార్యక్రమం జరగనుంది. ఒకేసారి 5,500 డ్రోన్లతో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే 1500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి డ్రోన్ పండగ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి "అమరావతి డ్రోన్ సమ్మిట్"ను అక్టోబర్ 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అమరావతిలో జరగనుంది. దేశంలోనే ఎన్నడూ జరగని విధంగా ఒకేసారి 5,500 డ్రోన్లతో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నారు. అందులో గెలుపొందిన వారికి లక్షల్లో బహుమతులు ఇవ్వనున్నారు. ఈ డ్రోన్ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.54 కోట్లను ఖర్చు చేయనుంది.
అందుకు సంబంధించి రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ ఎస్. సురేష్ కుమార్ జీవో ఆర్‌టీ నంబర్ 83 పేరుతో ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 6న శాఖల వారీ సమీక్షలో భాగంగా డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించే వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అప్పుడే ఈ సమ్మిట్‌కు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ డ్రోన్ కార్పొరేషన్ (ఏపీడీసీ), కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ డ్రోన్ సమ్మిట్ నిర్వహించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తన సమీక్షా సమావేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాతీయ డ్రోన్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వానికి సాంకేతిక మార్గదర్శకత్వం, మద్దతును అందించాలని ప్రతిపాదించారు.
డ్రోన్ సమ్మిట్ అజెండా…
నేషనల్ డ్రోన్ సమ్మిట్‌లో అగ్రికల్చర్, హెల్త్ కేర్, అర్బన్ ప్లానింగ్, లా అండ్ ఆర్డర్ వంటి రంగాల్లో డ్రోన్‌ల ఉపయోగం కోసం విభిన్నమైన అప్లికేషన్‌ల అభివృద్ధిపై అజెండా చర్చిస్తారు. అలాగే డ్రోన్ పరిశోధన, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్ పాలసీ క్రియేషన్ అజెండాలో ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.
డ్రోన్ సమ్మిట్ లక్ష్యాలు:
1. డ్రోన్ వినియోగ కేసుల గుర్తింపు, వాటి వాణిజ్యకరణ వ్యాప్తి.
2. డ్రోన్ పరిశ్రమ భాగస్వాములను పెట్టుబడిదారులు, విద్యావేత్తలతో పరిచయం.
3. డ్రోన్ భాగాలతో సహా డ్రోన్ సిటీని స్థాపించడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం.
4. పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులతో సహకార అవకాశాల అన్వేషణ.
రూ.5.54 కోట్లతో డ్రోన్ సమ్మిట్
డ్రోన్ సమ్మిట్ నిర్వహించడానికి సహకరించాలని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్ఐ)ని ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ (ఏపీడీసీ)ఆహ్వానించింది. డ్రోన్ రంగంలో 500-600 మంది ప్రతినిధులు, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో రెండు రోజుల సమ్మిట్ ఖర్చులతో సహా, విజయవాడలోని బెర్మ్ పార్క్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రూ.6.37 కోట్ల వ్యయంతో (జీఎస్‌టీ మినహా) సమ్మిట్ నిర్వహించడానికి డీఎఫ్ఐ వారు ప్రతిపాదనను సమర్పించారు.
ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ నిర్వహణను సులభతరం చేయడానికి ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా రూ.6 కోట్ల (జీఎస్‌టీ మినహాయించి) ప్రతిపాదిత బడ్జెట్‌ను మంజూరు చేయాలని కేంద్ర పౌరు విమానయాన మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. అయితే డీఎఫ్ఐ తన ప్రతిపాదిత బడ్జెట్‌ను సవరించి రూ. 5.54 కోట్ల (జీఎస్‌టీ మినహాయించి) సమర్పించింది. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను రూ.5.54 కోట్లతో నిర్వహించనున్నారు.
పున్నమి ఘాట్ వద్ద భారీ డ్రోన్ షో
సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ సమ్మిట్‌ను 22 తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. సాయంత్రం విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద ఐదు వేల కంటే ఎక్కువ డ్రోన్‌లతో భారీ డ్రోన్ షో నిర్వహిస్తారు. తొమ్మిది థీమ్స్‌ను నాలుగు కేటగిరీలుగా విభజించి, ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారు.
ప్రథమ బహుమతికి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతికి రూ.2 లక్షలు, తృతీయ బహుమతికి రూ. 1 లక్ష అందిస్తారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్‌తో సంబంధం ఉంటుంది. భవిష్యత్తులో వారికి ప్రోత్సహకాలు ఇస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఇప్పటికే 1,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్నవారిని, స్టార్టప్ కంపెనీలను, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు అందరిని ఆహ్వానించామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా డ్రోన్ ఎమార్జింగ్ టెక్నాలజీగా ఉందని, సివిలియన్ అప్లికేషన్స్, డిఫెన్స్ అప్లికేషన్స్‌లో ఉపయోగించే డ్రోన్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కానీ మన దేశంలో ఇప్పటి వరకు డ్రోన్ తయారీ, టెస్టింగ్, డ్రోన్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైయ్యాయని అన్నారు. దాదాపు 400 నుంచి 500 స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలో పని చేస్తున్నాయి. అయితే దీన్ని బలోపేత చేసేందుకు ఒక ఏకో సిస్టమ్ అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.