Pensions in AP : ఏపీలో 94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి - ఇవాళ్టితో పూర్తి చేసేలా ఏర్పాట్లు
06 April 2024, 6:24 IST
- Pensions Distribution in AP : ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 94 శాతం ఫించన్లు పంపిణీ పూర్తయినట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీలో పెన్షన్ల పంపిణీ (ఫైల్ ఫొటో)
Pensions Distribution in AP Updates: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్(Election Code in AP) నేపథ్యంలో ఫించన్ల పంపిణీపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో… పలుచోట్ల వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఇందుకు ప్రత్యామ్నయంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం….. పింఛన్ల పంపిణీకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన పింఛన్ల పంపిణీపై(Pensions Distribution in AP) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
శుక్రవారం(మార్చి 05) నాటికి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ(Pensions Distribution in AP) ప్రక్రియ 94 శాతం పూర్తయిందని వెల్లడించింది. రూ. 1847 కోట్ల 52 లక్షలను…. ఫించన్లు దారులకు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 65.69 లక్షల మంది ఫించను దారులకు ఫించన్లు అందించేందుకు 1951 కోట్ల 69 లక్షల రూ.లను విడుదల చేయగా ఈనెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఫించన్లు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి 94 శాతం మంది ఫించన్ దారులకు 1847 కోట్ల 52 లక్షల రూ.లను పించన్లుగా అందించడం జరిగిందని శశి భూషణ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవాళ్టితో పూర్తి….
మిగతా పింఛన్ల దారులకు వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు. ఇవాళ(శనివారం) ఉదయం 7 గంటల నుంచే ఫించన్లు పంపిణీ చేపట్టి నూరు శాతం ఫించన్లు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఏపీ సచివాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ ఆదేశాలను సవరించిన ఈసీ... పెన్షన్ల పంపిణీపై(AP Pensions Distribution) మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు వివిధ కేటగిరీల వారీగా పెన్షన్లు(Pension) పంపిణీ చేయాలని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. కొంత మందికి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ అందించాలని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ, సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల పింఛన్ దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది మాత్రమే ఉండడంతో రెండు కేటగిరీలుగా పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో... ఈ నాలుగు రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలను(AP Sachivalayas) పనిచేయాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వం ఏర్పాట్లు చేసి…. పింఛన్లను పంపిణీ చేస్తోంది. ఇవాళ్టితో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.