తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Water For Krishna Canals: కృష్ణా కాల్వలకు నీళ్లు విడుదల, డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సిఎస్ ఆదేశం…

Water for Krishna Canals: కృష్ణా కాల్వలకు నీళ్లు విడుదల, డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సిఎస్ ఆదేశం…

Sarath chandra.B HT Telugu

09 April 2024, 6:00 IST

google News
    • Water for Krishna Canals: కృష్ణా డెల్టా కాల్వలకు నీటిని విడుదల చేశారు.  ప్రకాశం బ్యారేజీ ఎగువున ఉన్న ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటడంతో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కాల్వలకు విడుదలైన నీటికి డ్రోన్లతో కాపలా ఏర్పాటు చేస్తున్నారు. 
ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల

ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల

Water for Krishna Canals: కృష్ణా జలాశయాల్లో Krishna reservoirs నీరు అడుగంటి పోవడంతో అందుబాటులో ఉన్న నీటిని పొదపుగా వాడుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు KRMBఆదేశాలతో విడుదల చేసిన నీటిని జాగ్రత్తగా చెరువులు నింపుకోవడం, తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకునేలా చర్యలు చేపట్టాలని AP సిఎస్ అధికారుల్ని ఆదేశించారు.

రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజి Prakasam Barrage నుంచి డెల్టా కాల్వలకు, నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువల ద్వారా విడుదల చేసిన నీరు సక్రమంగా శివారు ప్రాంతాల వరకూ చేరే విధంగా కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజి నుండి రైవస్,బందరు,ఏలూరు కాలువ,కృష్ణా పశ్చిమ కాలువల ద్వారా ఎన్టిఆర్,కృష్ణా,ఏలూరు, గుంటురూ,బాపట్ల జిల్లాలకు,నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి పల్నాడు,ప్రకాశం, గుంటూరు,బాపట్ల జిల్లాల్లోని వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపేందుకు నీటిని విడుదల చేశారు.

కాలువల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా మూడు నాలుగు రోజులు పాటు డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు.

డెల్టా కాలువల వెంబడి నీటిపారుదల,రెవెన్యూ తదితర శాఖల సిబ్బందితో టీంలను ఏర్పాటు చేసి, మంచి నీటిని చేపలు,రొయ్యల చెరువులకు అక్రమంగా మళ్ళించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు.

తాగునీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పారు.కాలువ శివారు ప్రాంతాలకు సక్రమంగా నీరు చేరేలా చూడాలని అన్నారు. కృష్ణా కాల్వల ద్వారా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని సిఎస్ ఆదేశించారు.

కాలువల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు నియమించిన అధికారులు సిబ్బందికి నీటి సరఫరా నిలిపి వేసే వరకూ, సుమారు 10 రోజుల పాటు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్లు,జల వనరుల శాఖ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

కాలువల వారీ ప్రత్యేక డయాగ్రామ్ ను సిద్ధం చేసి ఎంత మేరకు నీరు చేరింది ప్రతి రోజు మానిటర్ చేయాలని,సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఎన్నింటిని నీటితో నింపింది వంటి అంశాలపై వారం రోజుల పాటు డైలీ నివేదికను పంపాలని జిల్లా కలెక్టర్లును సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.అలాగే తాగునీటికి సంబంధించి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతరం పర్య వేక్షించాలని సిఎస్ ఆదేశించారు.

తాగునీటి అవసరాలకు ఈనెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజి నుంచి రోజుకు 2 వేల 500 క్యూసెక్కులు, 8వతేదీ సోమవారం ఉదయం 10.గం.ల నుండి నాగార్జున సాగార్ కుడి ప్రధాన కాలువ నుండి 5వేల 500 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా విడుదల చేశారు. కలెక్టర్లు పాటించి సకాలంలో అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపాలని ఇరిగేషన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకులు ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్లు వివరించారు.

తదుపరి వ్యాసం