Srikalahasti To Madurai : శ్రీకాళహస్తి నుంచి మధురైకి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్- తిరుమల దర్శన టికెట్ కూడా!
16 June 2024, 15:36 IST
- Srikalahasti To Madurai : శ్రీకాళహస్తి నుంచి మధురైకి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ నడుపుతోంది. మధ్యలో ఐదు పుణ్యక్షేత్రాలను కవర్ చేసేలా బస్ సర్వీస్ ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొదలై తిరుపతి, చిత్తూరు, వేలూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి , మధురై చేరుకుంటుంది.
శ్రీకాళహస్తి నుంచి మధురైకి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్
Srikalahasti To Madurai : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీసులను నడుపుతోంది. రాష్ట్రంలోని శ్రీకాళహస్తి నుంచి తమిళనాడులోని మధురైకి ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీకాళహస్తి నుంచి మధురైకి మధ్య ఐదు పట్టణాలను మీదుగా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి మరింత సౌకర్యం కానునుంది.
తీర్థ యాత్రలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించింది. తీర్థయాత్రలు చేసేవారికి సౌకర్యంగా ఉండేందుకు శ్రీకాళహస్తి నుంచి మధురైకి సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ నపిడే ఈ బస్ సర్వీస్ ఏపీలోని శ్రీకాళహస్తిలో బయలుదేరి, తిరుపతి, చిత్తూరు, వేలూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి (తిరుచిరాపల్లి) మీదుగా మధురై చేరుకుంటుంది. ఈ పట్టణాలన్నీ పుణ్య క్షేత్రాలే. శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకుని బయలుదేరిన యాత్రికులు తిరుపతిలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. ఈ బస్సు మధురై మీనాక్షమ్మను దర్శనానికి వీలుగా ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి మధురైకి ఒక సర్వీస్, తిరిగి మధురై నుంచి శ్రీకాళహస్తికి మరో సర్వీస్ మొత్తం రెండు సర్వీసులు ఉంటాయి.
శ్రీకాళహస్తిలో సాయంత్రం ఐదు గంటలకు బస్ (సర్వీస్ నెంబర్ 8006) ప్రారంభం అవుతుంది. తిరుపతి సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటుంది. మధురైలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన బస్ (సర్వీస్ నెంబర్ 8007) తిరుచ్చి రాత్రి 8.39కి చేరుకుంటుంది. ఈ బస్ సర్వీస్ టికెట్లను https://www.apsrtconline.in లో బుక్ చేసుకోవచ్చు. రౌండ్ ట్రిప్‌కు 10 శాతం రాయితీ ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తుంది. అలాగే సీనియర్ సిటీజన్స్‌కు 20 శాతం రాయితీ కల్పిస్తుంది. ఈ బస్ టిక్కెట్టుతో పాటు తిరుమల వెంకటేశ్వరుని స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టికెట్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఏపీఆర్టీసీ కల్పించింది.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు