APSRTC Sabarimala Tour Package : నెల్లూరు నుంచి శబరిమలకు ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీలు, ఇలా బుక్ చేస్తే ఏడుగురికి ఉచితం
04 November 2024, 16:44 IST
APSRTC Sabarimala Tour Package : శబరిమల వెళ్లే భక్తులు కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా నెల్లూరు డిపో నుంచి శబరిమల వెళ్లే భక్తులు ప్రత్యేక ప్యాకేజీలను ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. బస్సు మొత్తం బుక్ చేసుకునే భక్తులకు రాయితీ ప్రకటించింది.
నెల్లూరు నుంచి శబరిమలకు ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీలు, ఇలా బుక్ చేస్తే ఏడుగురికి ఉచితం
ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శబరిమల, శైవక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుపుతోంది. నెల్లూరు రీజియన్ నుంచి శబరిమల అయ్యప్పకొండకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. శబరిమల వెళ్లే అయ్యప్పస్వాములక ప్రతి సంవత్సరం అతి తక్కువ ఛార్జీలతో టూర్ ప్యాకేజీ అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కూడా తక్కువ ఛార్జీలతో నెల్లూరు నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
శబరిమలకు వెళ్లే భక్తులు బస్సు మొత్తం లేదా విడివిడిగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బస్సు మొత్తం బుక్ చేసుకుంటే ఏడుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. సూపర్ లగ్జరీలో ప్రయాణించే భక్తులకు ఆడియో, వీడియో సౌకర్యం కలదన్నారు. బస్సును అద్దెకు బుక్ చేసుకునే గురుస్వాములకు, ఏజెంట్లకు మినిమం 5 రోజులు రూ.2000 కమీషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. బస్సును అద్దె ప్రాతిపదికన బుక్ చేసుకొన్న వారికి చివరి రోజు 12 గంటలు ఉచితం ప్రయాణం కల్పిస్తామని నెల్లూరు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్యాకేజీ ఛార్జీలు
5 రోజులు ప్యాకేజీ టూర్ కు - నెల్లూరు నుంచి రానుపోను ఛార్జీలు(ఒక్కొక్కరికి)
- సూపర్ లగ్జరీ - రూ.4,000
- అల్ట్రా డీలక్స్ - రూ. 3900
- ఎక్స్ ప్రెస్ - రూ. 3300
అయ్యప్ప భక్తులు కోరుకున్న మార్గంలో దర్శనానికి వెళ్లడానికి ప్రత్యేక ప్యాకేజీ- ఒక కి.మీకు ఛార్జీ
- సూపర్ లగ్జరీ - రూ.57
- అల్ట్రా డీలక్స్ - రూ.61
- ఎక్స్ప్రెస్- రూ.62
- అల్టా పల్లె వెలుగు-రూ.62
అద్దె ప్రాతిపదిక రోజుకు 420 కి.మీ ప్రకారం ఛార్జీలు లెక్కిస్తారు.
రూట్ వివరాలు : కాణిపాకం, భవాని, ఎరిమేలి, పంబ మీదుగా శబరిమల చేరుకుంటారు. వచ్చేటప్పుడు కుర్తాళం, మధురై, చెన్నై, మేళమరువత్తూర్ మీదుగా వస్తారు.
టూర్ తేదీలు :
- నవంబరు -17, 18, 20, 22, 25, 26, 28
- డిసెంబర్ - 3, 4, 6, 10, 11, 13, 17, 18, 20, 22, 25, 28, 20, 25, 20, 25
- జనవరి -3,5,7
నెల్లూరు ఆర్టీసీ మెయిన్ స్టేషన్ నుంచి ఉదయం 10-00 గంటలకు బస్సులు బయలుదేరతాయి. 36 మంది భక్తులు ఉంటే వారికి అనుకూలమైన తేదీలలో బస్సు అద్దెకు ఇస్తారు. ఈ ప్యాకేజీలపై విచారణకు 9959225653, 7382926439, 9959225641 నెంబర్లను సంప్రదించవచ్చు.
త్రిలింగ దర్శిని టూర్ ప్యాకేజీ
నెల్లూరు-1 డిపో నుంచి కార్తీక మాసం సందర్భంగా త్రిలింగ క్షేత్రదర్శిని టూర్ ప్యాకేజీ అదిస్తోంది ఆర్టీసీ. కార్తీక సోమవారం నాడు 3 ప్రముఖ శైవక్షేత్రాలను సందర్శించేందుకు నెల్లూరు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. యాగంటి, మహానంది, శ్రీశైలం క్షేత్రాలను ఈ టూర్ లో దర్శించుకోవచ్చు.
- యాగంటి- శ్రీ ఉమామహేశ్వరస్వామి క్షేత్రాన్ని 15వ శతాబ్దంలో విజయనగర వంశస్థులు నిర్మించారు. పుష్కరిణిలోనికి నీరు- అక్కడ ఉన్న నంది విగ్రహం నోటి ద్వారా రావడం ప్రత్యేకత.
- మహానంది - ఇక్కడి నంది విగ్రహలు నవనందులుగా ప్రసిద్ధి. ఇక్కడి నంది విగ్రహం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది.
- శ్రీశైలం- మల్లిఖార్జునస్వామి పవిత్ర పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటి.
- టిక్కెట్టు ధర : సూపర్ లగ్జరీ రూ. 1800.
బస్సు నెల్లూరు మెయిన్ బస్టాండ్ నుంచి ప్రతి కార్తీక శనివారం నవంబరు 2, 9, 16, 23వ తేదీలలో రాత్రి 8 గంటలకు బయలుదేరి ఆదివారం త్రిలింగ క్షేత్రాలను దర్శించుకొని సోమవారం ఉదయం శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకొని సోమవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకుంటుంది.