Karthika Masam : కార్తీక మాసంలో ఏం చేస్తే మంచిది.. భక్తుల విశ్వాసం ఏంటీ?
Karthika Masam : కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనది. హరి (విష్ణువు), హరుడు (శివుడు)కి అతి ప్రీతి పాత్రమైన మాసంలో ఉపవాస దీక్షలు, నిష్టతో పూజలు, ఆలయాల దర్శనాలు చేస్తే కైలాసాన్ని చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. దేవతాస్నానం చేస్తే యాగఫలం సిద్ధిస్తుందని నమ్మకం.
కార్తీక మాసంలో.. కార్తీక స్నానం, ఆలయ దర్శనం, దాన ధర్మాలు, ఉపవాస దీక్షలు, వన భోజనం, దీపారాధన తదితర కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి? వాటి ఫలితం ఎలా ఉంటుందో శ్రీముఖలింగం అర్చకులు వివరించారు.
ఉపవాసం ఎప్పుడు చేయాలి?
ప్రధానంగా సోమవారాలు, ఏకాదశి, శనివారంతో పాటు ఇతర రోజుల్లో కూడా ఈ నెల రోజులు అన్నీ పుణ్య దినాలేనని అర్చకులు చెబుతున్నారు. కార్తీక సోమవారం ఆచరించే వారు మరణం తరువాత కైలాసంలో శివ సన్నిధిని చేరుకుంటారని వివరిస్తున్నారు. ఇదే నెలలో ఏ సోమవారాన్ని ఆచరించినా వేయి ఆశ్వమేధాల యాగా ఫలాన్ని పొందుతారని అన్నారు.
అందువల్ల ఈ మాసంలో ఉపవాసం చేస్తే ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. భక్తులు కార్తీక సోమవారం పగలంతా ఉపవాస దీక్షలో ఉండి, సాయంత్రం శివుడికి అభిషేకం చేస్తారు. మంత్ర జపం తెలియని వారు, ఉపవాస దీక్షలు చేయలేని వారు నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే పుణ్యంఫలం కలుగుతుంది. ఉపవాసం దీక్షలు చేయలేనివారు, ఉదయాన్నే స్నానం చేసి, ఆలయాల దర్శనం తరువాత మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి అల్పాహారం తినొచ్చు.
కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి?
కార్తీక మాసంలో నదుల్లో స్నానాలు చేస్తే మంచిది. అవకాశం లేనివారు కాలువలు, ఇంటి వద్ద ప్రాతఃకాల సాన్నాలు చేసి దేవాలయాలు సందర్శిస్తే ఎంతో మంచిది. కనీసం కార్తీక మాసం నెల రోజుల్లో ఒక్క రోజైనా శివుడిని, విష్ణువుని దర్శించుకుంటే మంచింది. అవకావం లేనివారు శుక్ల, పాడ్యమి, పౌర్ణమి, అమావాస్య దినాల్లో దేవతా స్నానం (వేకువజాము) చేస్తే పుణ్యఫలం కలుగుతుంది.
కార్తీక మాసంలో ఇష్ట దైవమైన శివుడు, విష్ణువు తదితర దేవుళ్లుకు పూజలు చేయడం ఎంతో మంచింది. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. అలాగే దీపం కింద భాగం బ్రహ్మగా, స్తంభం విష్ణువు ప్రతిరూపంగా, ప్రమిదను శివునిగా పురాణాల్లో చెబుతారు. నదులు, జలాశయాలు, చెరువులు, కాలవల్లో దీపాలు వదలడం వల్ల పాపాలు సమిసి పోతాయని భక్తులు నమ్మకం. కార్తీక మాసంలో రోజూ దీపాలు వదలడం ద్వారా శాంతి, సుఖం, సౌఖ్యం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
ఉసిరి చెట్టు ఉన్న తోటలో..
బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నాలుగు గంటలకు లేచి, స్నానమాచరించి, సంధ్యోపాసన చేసి కార్తీక పురాణం పారాయణం చేయాలి. అలాగే అన్ని రకాల వృక్షాలతో పాటు ఉసిరి చెట్టు ఉన్న తోటల్లో వన భోజనం చేస్తే పాపాల నుంచి విముక్తి పొందుతారు. కార్తీక దామోదరుడైన విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు.
అయ్యప్ప మాలలు..
సరిగ్గా ఇదే సమయంలో అయ్యప్ప మాలలు కూడా ధరిస్తారు. 41 రోజుల దీక్ష అనంతరం ఇరిముడితో శబరిమల వెళ్లి మాల తీస్తారు. కన్య స్వాములు (తొలిసారి మాల వేసిన వారు) తప్పని సరిగా శబరిమల వెళ్తారు. మిగతా స్వాముల్లో అధిక భాగం శబరిమల వెళ్తారు. అలాగే కొంత మంది స్వాములు ఇరిముడితో ద్వారపూడి వెళ్లి అక్కడ మాల తీస్తారు. కార్తీక మాసం మొత్తం అయ్యప్ప స్వాములు దీక్షతో పూజలు, దేవతాస్నానాలు, ఉపవాసాలు వంటి వాటిని ఆచరిస్తారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)