AP Congress : ‘చలో సెక్రటేరియట్’లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో వైఎస్ షర్మిల
22 February 2024, 14:59 IST
- APCC President YS Sharmila: ‘చలో సెక్రటేరియట్'కి బయల్దేరిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
షర్మిలను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
APCC President YS Sharmila: డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. చలో సెక్రటేరియట్‌కి బయలుదేరిన APCC అధ్యక్షురాలు షర్మిలా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా విజయవాడ - ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆమెను దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నట్లు సమాచారం.
మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని ఆరోపిస్తూ… కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిరుద్యోగ అభ్యర్థులకు మేలు జరిగేలా మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి వైఎస్ షర్మిలతో పాటు ఆ పార్టీ నేతలు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సచివాలయానికి వెళ్లకుండా… పలువురిని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ షర్మిలా రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. ఈ సమయంలో షర్మిల… పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ మహిళా పోలీసుల సాయంతో ఆమెను అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి నినాదాలు చేశారు.
అరెస్టులపై షర్మిల ఆగ్రహం…
చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా… పలువురి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు.మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు.నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారు.మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే.ఇందుకు మీ చర్యలే నిదర్శనం.CWC సభ్యులు గిడుగు రుద్రరాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి” అని షర్మిలా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.