AP TET Notification : ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూల్ ఇదే
01 July 2024, 22:34 IST
- AP TET Notification : ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. టెట్ సిలబస్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. జులై 4 నుంచి 16 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, జులై 2 నుంచి దరఖాస్తులు స్వీకరణ
AP TET Notification : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET 2024) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 2 ఆన్ లైన్ లో టెట్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంచనుంది. ఏపీ టెట్ నోటిఫికేషన్, తేదీలు, సిలబస్ ఇతర పూర్తి వివరాలను https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందవచ్చు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఏపీ టెట్ సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
జులై 2న టెట్ నోటిఫికేషన్ ను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. జులై 4 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ స్వీకరించనున్నారు. జులై 25న టెట్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహస్తామని, ఆగస్టు 25న టెట్ ఫైనల్ కీ, ఆగస్టు 30న ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏపీలో ఎన్నికలకు ముందు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత వైసీపీ ప్రభుత్వం టెట్ నిర్వహించింది. ఈ పరీక్షకు 2.35 లక్షల అభ్యర్థులు హాజరుకాగా, 1,37,903 మంది టెట్ అర్హత సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. మెగా డీఎస్సీ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్‌లో ఫెయిలైన వారికి మరో అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు.
పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. త్వరలో 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీకానుంది.