AP TET Results 2024 : మెగా డీఎస్సీపై ప్రకటన - ఏ క్షణమైనా 'ఏపీ టెట్' ఫలితాలు..!
AP TET Results 2024 Updates: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మెగా డీఎస్పీపై ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు 2024 ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. నిజానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు మార్చి 14వ తేదీనే రావాల్సి ఉంది. కానీ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది.
ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రుల శాఖలు కూడా ఖరారయ్యాయి. మరోవైపు మెగా డీఎస్సీ దస్త్రంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం కూడా చేశారు. విద్యాశాఖ బాధ్యతలను నారా లోకేశ్ చూస్తున్నారు. 16వేల డీఎస్సీ పోస్టులను కూడా ఈ ఏడాది డిసెంబర్ కల్లా రిక్రూట్ చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయటంతో పాటు విద్యాశాఖ మంత్రి నియామకం కూడా జరగటంతో ఏ క్షణమైనా టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే లోపే… టెట్ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. గత డీఎస్సీ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా కొత్తగా కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు విడుదలైతే… చాలా మంది అభ్యర్థులు టెట్ కు అప్లికేషన్ చేసుకునే అవకాశం వీలు ఉంటుంది.
ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ తేదీన ఫలితాలు రావాల్సినప్పటికీ… ఎన్నికల కోడ్ తో ఆగిపోయింది. అప్పట్నుంచి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. టెట్ పరీక్ష అర్హత సాధిస్తే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ వస్తుంది.
Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి... స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మెగా డీఎస్సీ - పోస్టులు ఎన్నంటే…?
ఏపీలో తాజాగా వచ్చే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ - 7,725
- ఎస్‌జీటీ - 6371
- టీజీటీ - 1781
- పీజీటీ - 286
- పీఈటీ - 132
- ప్రిన్సిపల్స్ - 52
వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెట్ ఫలితాలు రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో డీఎస్సీ పరీక్షలు మాత్రం వాయిదా పడుతూ వచ్చాయి. ఇంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో…. సీన్ మారిపోయింది. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదలకు శ్రీకారం చుట్టింది.
ప్రక్రియ పూర్తికి డెడ్ లైన్….
విద్యాశాఖ కొత్తగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు.