AP SSC Results 2023: ఈనెల 19 నుంచి టెన్త్ పేపర్ల వాల్యుయేషన్.. ఫలితాలు ఎప్పుడంటే..?
13 April 2023, 19:01 IST
- AP SSC Results 2023 Updates: ఏపీ పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు మే రెండో వారంలో ఫలితాలను విడుదల చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఏపీ పది ఫలితాలు
AP SSC Results 2023: ఏపీ పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. మరోవైపు స్క్వాడ్స్ కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పరీక్షలు ఏప్రిల్ 18వ తేదీన ముగియనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరుగనుంది. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి తర్వాత... మే రెండో వారంలో ఫలితాలను ఇవ్వాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే ప్రణాళిక ఖరారు చేశారు.
మరోవైపు పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో ఎవరైనా విద్యార్థి నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
మూల్యాంకనంలో పాల్గొనే అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధానాల పత్రాలను మాత్రమే మూల్యాంకన చేయాలని పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసే సమాధాన పత్రాలన్నిటినీ స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిగా పరిశీలన చేసి మార్కులను లెక్కించాల్సి ఉంటుందని పేర్కొంది. నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానాలు రాశారా అన్న అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గమనించాలని తెలిపింది. అదనంగా రాసిన ప్రశ్నల సమాధానాలను అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకన చేసి మార్కులు ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి నిర్ణీత ప్రశ్నల సంఖ్య మేర మార్కులను కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను తీసివేయాలి. పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం, ఫొటోస్టాట్ కాపీలను అందించడం వంటివి ఉన్నందున మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహించి పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పేర్కొంది.