Mega DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా!
09 November 2024, 21:36 IST
Mega DSC Free Coaching : ఏపీలో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడినట్లు సమాచారం.
డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా!
రాష్ట్రంలో మెగా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆదివారం (నవంబర్ 10)న జరగాల్సి స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడింది. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై మళ్లీ కొత్తగా తేదీలు ప్రకటిస్తారు. అప్పటి వరకు డీఎస్సీ ఉచిత శిక్షణ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తేనే, అభ్యర్థులను ఎంపిక చేసి మెగా డీఎస్సీకి వసతితో కూడిన ఉచిత కోచింగ్ నిర్వహించనున్నారు.
స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడటానికి కారణమేంటీ?
డీఎస్సీ ఉచిత కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడటానికి ఎన్నికల కోడే కారణమని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, అలాగే విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు, విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఏదైనా ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అందువల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో రాష్ట్రంలోని ఈనెల 10 తేదీన (ఆదివారం) నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
అయితే విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై స్తబ్ధత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన తరువాత, రాష్ట్ర హైకోర్టు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ తీసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు అక్టోబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన, ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యంతో మూడు నెలల పాటు శిక్షణ పొందుతారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.
ఎంతమంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు?
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీ అభ్యర్థులు 3,050, ఎస్టీ అభ్యర్థులు 2,000 మంది ఉన్నారు. ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్ వెయిటేజ్ బట్టీ ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌కు 85 శాతం, టెట్ స్కోర్‌కు 15 శాతం కేటాయించారు. స్క్రీనింగ్ టెస్ట్ రాసిన వారిని జిల్లాల వారీగా మెరిట్ లిస్టులను విడుదల చేస్తారు.
16,347 ఉపాధ్యాయ పోస్టులతో నవంబర్ 3న మెగా డీఎస్సీకి ఇస్తామన్న నోటీఫికేషన్ కూడా వాయిదా పడింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే మెగా డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేయాలని భావించినప్పటికీ, విడుదల చేయలేదు. కేవలం మెగా డీఎస్సీపైన సంతకం మాత్రమే పెట్టారు. నోటిఫికేషన్ విడుదల చేయకపోవడానికి కారణం మరింత మందికి అర్హత కల్పించాలనే భావనతో మరోమారు టెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవలి టెట్ ఫలితాలు వెలువడ్డాయి. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు