AP Aadhaar Camps : గ్రామ, వార్డు సచివాలయాలు, అంగన్వాడీల్లో ఆధార్ సేవలు- ఈ నెల 20 నుంచి 24 వరకు ప్రత్యేక క్యాంపులు
17 August 2024, 15:43 IST
- AP Aadhaar Camps : కొత్త ఆధార్ కార్డులు నమోదు, ఆధార్ అప్డేట్ కు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తుంది. ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. కొత్త కార్డుల నమోదు, బయోమోట్రిక్, పేరు, అప్డేట్ చేయనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, అంగన్వాడీల్లో ఆధార్ సేవలు- ఈ నెల 20 నుంచి 24 వరకు ప్రత్యేక క్యాంపులు
AP Aadhaar Camps : కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ అప్ డేట్ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదురోజుల పాటు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులకు నమోదు చేయడంతో పాటు ఐదేళ్లు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు. అలాగే పదేళ్లుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోని వారికి కూడా అప్డేట్ చేయనున్నారు. బయోమోట్రిక్ అప్డేట్‌తో పాటు పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ లో మార్పులు చేయనున్నారు.
పదేళ్లకు ఒకసారైనా అప్డేట్
కేంద్ర ప్రభుత్వం, ఆధార్ జారీ సంస్థ ఉడాయ్ నిబంధనల ప్రకారం... కనీసం పదేళ్లకు ఓసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. గుర్తింపు కార్డు లేదా చిరునామా గుర్తింపు తెలిపే పత్రాలు అందించి ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రజల సమాచారం ఉడాయ్ వద్ద అప్డేట్ అవుతాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఆధార్ కార్డుల నమోదు, అప్డేట్ కోసం ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
ఆగస్టు 20 నుంచి 24 వరకు ఆధార్ క్యాంపులు
ఇటీవల పుట్టిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ, గతంలో ఆధార్ కార్డులు తీసుకుని నిబంధనల మేరకు అప్డేట్ చేసుకోవాల్సిన వారు 1.83 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వారి కోసం ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ సంస్థ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రతినెలా గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు కాలేజీలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహించనున్నారు.
1.83 కోట్ల మంది అప్డేట్ చేసుకోవాల్సిందే
ఏపీలో ఇంకా 1.83 కోట్ల మంది తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని ఉడాయ్ తెలిపింది. చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు, బయోమెట్రిక్ తో ఫొటో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసు దాటిన వారి తమ వేలిముద్రలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉందని ఉడాయ్ స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాల్సిన వారు 48,63,137 మంది ఉన్నారని తెలిపింది. గతంలో ఆధార్ పొందిన పదేళ్లలో ఒకసారైనా ఆధార్ లోని అడ్రస్‌తో పాటు ఫొటో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేటగిరిలో 1,35,07,583 మంది అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.