తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Flood Relief : ఏపీ వరద బాధితులకు ప్రభుత్వ పరిహారం, రేపు ఖాతాల్లో నగదు జమ

AP Flood Relief : ఏపీ వరద బాధితులకు ప్రభుత్వ పరిహారం, రేపు ఖాతాల్లో నగదు జమ

06 October 2024, 22:52 IST

google News
    • AP Flood Relief : వరదల బాధితుల్లో 98 శాతం మందికి ఇప్పటికే వరద సాయం ఖాతాల్లో జమ చేశామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 2 శాతం మందికి సోమవారం పరిహారం జమ చేస్తామని స్పష్టం చేసింది. బ్యాంక్ ఆధార్ లింక్, సాంకేతిక కారణాలతో పరిహారం అందజేత ఆలస్యమైందని పేర్కొంది.
ఏపీ వరదల బాధితులకు ప్రభుత్వ పరిహారం, రేపు ఖాతాల్లో నగదు జమ
ఏపీ వరదల బాధితులకు ప్రభుత్వ పరిహారం, రేపు ఖాతాల్లో నగదు జమ

ఏపీ వరదల బాధితులకు ప్రభుత్వ పరిహారం, రేపు ఖాతాల్లో నగదు జమ

టీవలి వరదలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. బుడమేరు ఉద్ధృతితో విజయవాడ నగరం ముంపునకు గురైంది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. వరద బాధితులకు ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే సాంకేతిక కారణాలతో కొంత మంది ఖాతాల్లో వరద సాయం జమ కాలేదు. వీరందరికీ ప్రభుత్వం రేపు(సోమవారం) వరద సాయం ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 21,769 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

వరద బాధితులందరికీ సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. వరద బాధితులకు గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడంతో కొందరికి నగదు జమకాలేదు.

98 శాతం మందికి పరిహారం అందజేత

వరద బాధితుల్లో 98 శాతం మందికి పరిహారం అందించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద సాయంగా ప్రకటించిన మొత్తం రూ.602 కోట్లలో రూ.18 కోట్లు మాత్రమే మిగిలినట్లు ప్రకటించింది. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2 శాతం మందికి సోమవారం నగదు జమచేయనున్నట్లు వెల్లడించింది. ఆధార్ లింక్ కాకపోవడం, సాంకేతిక కారణాలతో పరిహారం పొందని ప్రతి కుటుంబానికి నగదు జమ చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో 15 వేల కుటుంబాలు, అల్లూరి జిల్లాలో 4,620 కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో వరద బాధితులకు అకౌంట్లతో డబ్బులు జమ చేయనున్నారు.

వరద సాయం పెంచాలి - సీపీఎం

తిరుపతి లడ్డుపై పెట్టిన శ్రద్ధ, వరద బాదితులను ఆదుకోవడంపై పెట్టాలని సీపీఎం సీనియర్ నేత సీహెచ్ బాబూరావు హితవు పలికారు. ప్రకృతి వైపరీత్యంతో పాటు గత, నేటి పాలకుల వైఫల్యం వరద కష్టాలకు కారణమైందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన వరద సహాయంపై టీడీపీ, జనసేన, వైసీపీ నోరుమెదపడంలేదన్నారు.

వరదలు వచ్చి 35 రోజులు గడిచినా, ఇంకా వేలాది మందికి వరద సాయం అందలేదన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో 11.5 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇది ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదం అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఈ విపత్తులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంది, గత పాలకుల వైఫల్యమూ ఉందన్నారు.

చివరి బాధితుడికి పరిహారం ఇస్తామని సీఎం చెప్పారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని అడుగుతున్నామన్నారు. గత నెల 13న వరద బాధితులను ఎన్యుమరేట్ చేస్తామని అధికారులు ప్రకటించారన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7500 కోట్ల నష్టంలో బాధితుల నష్టం లేదన్నారు. బాధితులు సుమారు రూ.5000 కోట్లు నష్టపోయారన్నారు. తిరుపతి లడ్డుపై చూపించిన ఆసక్తి, శ్రద్ధ వరద బాధితులపై పెడితే బాగుండేదన్నారు. అనవసర విషయాలపై దీక్షలు కాదు.. వరద సహాయంపై కేంద్రంతో మాట్లాడాలన్నారు. వరద సహాయం పెంచాలని సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. పేదల పునరావాస కాలనీలు వరదలో ఎక్కువ ముంపునకు గురైయ్యాయన్నారు.

తదుపరి వ్యాసం