AP Govt Schemes : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, విద్యాశాఖ పథకాల పేర్లు మార్పు
28 July 2024, 8:36 IST
- AP Govt Schemes : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి పేరిట ఉన్న పథకాల పేర్లను మార్పు చేసింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, విద్యాశాఖ పథకాల పేర్లు మార్పు
AP Govt Schemes : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ పరిధిలోని పలు పథకాల పేర్లను మార్చింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ పేరుతో ఉన్న పథకాలకు జాతీయ నాయకుల పేర్లపై మార్చింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అయిదేళ్లపాటు గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిందని లోకేశ్ ఆరోపించారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పం అన్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నామన్నారు. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు పెట్టి, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నానని లోకేశ్ తెలిపారు.
పాత స్కీమ్ పేరు - కొత్త స్కీమ్ పేరు
- జగనన్న అమ్మ ఒడి : తల్లికి వందనం
- జగనన్న విద్యా కానుక : సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
- జగనన్న గోరు ముద్ద : డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఒడి భోజనం
- మన బడి నాడు- నేడు : మన బడి- మన భవిష్యత్తు
- స్వేచ్ఛ : బాలికా రక్ష
- జగనన్న ఆణిముత్యాలు : అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం