AP Govt Schemes : ప్రభుత్వాలు మారినప్పుడు సంక్షేమ పథకాల పేర్లు మారుతుంటాయి. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం... గత వైసీపీ ప్రభుత్వ పేర్లను మార్పుచేర్పులు చేస్తుంది. ఇప్పటికే పెన్షన్ పథకం పేరును వైఎస్ఆర్ భరోసాను ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. తాజాగా మరికొన్ని పథకాల పేర్లు మార్చింది. దీంతో పాటు గత ప్రభుత్వంలో పార్టీ రంగులతో ఉన్న సర్టిఫికేట్లు, వెబ్ సైట్లలో పార్టీల రంగులు మార్చాలని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేసింది. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ... గత టీడీపీ ప్రభుత్వంలో అమలైన పథకాల పేర్లు మార్చింది. జగన్, వైఎస్ఆర్ పేర్లను సంక్షేమ పథకాలను జోడించారు. తాజాగా ఈ పథకాలకు పూర్వపు పేర్లనే పెట్టాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. ఈ సర్కులర్ ఆధారంగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయనున్నారు.
ఎలక్షన్ కోడ్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చిన హైసెక్యూరిటీ పేపర్లను మాత్రమే ప్రస్తుతం ఉపయోగించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజా ఉత్తర్వులు జారీచేసింది. హైసెక్యూరిటీ పేపర్ పై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫొటో కలిగి ఉన్న సర్టిఫికెట్ ను మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. 2019 మే నెలకి ముందు ప్రారంభమై, 2019 - 2024 మధ్య కొనసాగించని ప్రభుత్వ పథకాల పేర్లు మరల 2019లో ఎలా ఉండేవో ఆ విధంగా మార్పు చేయాలని పేర్కొంది. 2019-24 మధ్యలో ప్రారంభమైన కొత్త పథకాల పేర్లను వెంటనే తొలగించి, కొత్తగా పేర్లు పెట్టే వరకు సాధారణ పేరును మాత్రమే ఉపయోగించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో పార్టీ జెండా రంగులను తీసివేయాలని ఆదేశించింది. పాస్ పుస్తకాలపై, లబ్ధిదారుల కార్డులపై, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన సర్టిఫికెట్లపై పార్టీ జెండాలకు సంబంధించిన రంగులు ఉన్నట్టయితే వాటిని వెంటనే నిలుపుదల చేయాలని పేర్కొంది.
సంబంధిత కథనం