తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections 2024 : వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు, సచివాలయ సిబ్బందికి ఆ పనులే- ఈసీ ఆదేశాలు

AP Elections 2024 : వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు, సచివాలయ సిబ్బందికి ఆ పనులే- ఈసీ ఆదేశాలు

27 March 2024, 11:24 IST

google News
    • AP Elections 2024 : ఏపీ ఎన్నికల విధులపై ఈసీ కీలక సూచనలు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ముఖ్యమైన ఎన్నికల విధులు ఇవ్వొద్దని సూచించింది. ఇక వాలంటీర్లను ఎన్నికలు విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఈసీ ఆదేశాలు
ఈసీ ఆదేశాలు

ఈసీ ఆదేశాలు

AP Elections 2024 : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల(Volunteers) ఎన్నికల విధులపై(AP Elections 2024) కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో వినియోగించవద్దని సీఈవోను ఆదేశించింది. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లను అనుమతించొద్దని తెలిపింది. ఇక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులపైనా ఆదేశాలు ఇచ్చింది. వారికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని పేర్కొంది. సచివాలయ సిబ్బందికి కీలక ఎన్నికల విధులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అయితే గ్రామ, వార్డు, సచివాలయ(Gram Ward Sachivalaya Staff) సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకునేందుకు అభ్యంతరం లేదని ప్రకటించింది. ఈ మేరకు సీఈవోకు పలు సూచనలు చేసింది. బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది. వారికి పోలింగ్‌ రోజు (Polling Day)ఇతర పనులు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని సీఈవోకి రాసిన లేఖలో ఈసీ(EC) పేర్కొంది. ఎన్నికల సంఘం సూచనలతో సీఈవో(CEO) ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లు, అధికారులకు లేఖ రాశారు.

టీచర్లకే బాధ్యతలు!

ఎన్నికల విధులను టీచర్లకే అప్పగించాలని ప్రతిపక్షాలు ఈసీని కోరాయి. దీంతో టీచర్ల వివరాలు ఇవ్వాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఈసీ తాజాగా పలు సూచనలు చేసింది. వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఆదేశించింది.

టీచర్ల వివరాలు అడిగిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నిల విధుల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించాలని ప్రభుత్వ నిర్ణయం విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను బోధనా విధులకే పరిమితం చేయాలని కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని భావించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని విపక్షాలు తప్పుపట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మరోవైపు సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు వంటి డిమాండ్లతో రెండేళ్ల క్రితం ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. ఆ సమయంలో ఉపాధ్యాయుల ఉద్యమాలను ప్రభుత్వం అణిచివేసింది. దీని ప్రభావం ఎన్నికల్లో ఉంటుందనే అనుమానంతోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నికల విధులకు వినియోగించడానికి సిద్ధమైనట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు కేంద్ర బృందం ఇటీవల ఏపీలో పర్యటించింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈసీని కలిసి సచివాలయ సిబ్బందిని ఎన్నికల్లో వినియోగించడంపై అభ్యంతరం తెలిపాయి. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో ఎంత మంది ఉద్యోగులు అవసరం అవుతారో అంచనాలు వేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు అవసరం అవుతారని 46 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికల్లో ఉపాధ్యాయులతోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహణ బాధ్యతలను టీచర్లకే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం